అన్నయ్యా! నీకిది తగునా? అని ప్రశ్నిస్తున్న మెగాస్టార్ అభిమానులు!
150 సినిమాల్లో హీరోగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి అభిమానగణాన్ని పెంచుకొని మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి గత కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆయన అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.
శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాలవైపు వెళ్ళిన ఆయన అక్కడ రాణించలేకపోయారు. తిరిగి ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఎంత గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఆ సినిమా సాధించిన ఘనవిజయం నిరూపించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ఆ సినిమా ఒక తమిళ రీమేక్ అనే విషయం తెలిసిందే. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఆ తర్వాత తన చిరకాల వాంఛ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో రూపొందిన సైరా నరసింహారెడ్డిలో నటించారు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
ఈ సినిమా తర్వాత చెయ్యాలనుకున్న సినిమాల లిస్ట్‌ను కూడా ప్రకటించారు చిరు. దాన్ని చూసి అభిమానులతోపాటు సినీ పరిశ్రమలోని వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. 42 ఏళ్ళ తన సినిమా కెరీర్లో రీమేక్‌ల జోలికి వెళ్ళని చిరంజీవి ఇప్పుడు రీమేక్‌లపైనే ఆధారపడుతున్నారు. ఇది ఎవ్వరికీ రుచించడం లేదు. చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టు, అతని ఇమేజ్‌కి తగ్గట్టు కథలు రెడీ చేసే ఎంతో మంది రైటర్స్ తెలుగులో ఉన్నారు. వారిని కాదని రీమేక్‌లపై దృష్టి పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆచార్య తర్వాత తమిళ్లో సూపర్‌హిట్ అయిన వేదాళం, మలయాళంలో సూపర్‌హిట్ అయిన లూసిఫర్ సినిమాలను లైన్ పెట్టారు చిరు. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ లూసిఫర్‌ను తెలుగులో రూపొందించే బాధ్యతను వినాయక్‌కు అప్పగించారని తెలుస్తోంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది.
ఆచార్య షూటింగ్ పూర్తయిన వెంటనే ఆ సినిమా ప్రారంభమవుతుంది. అలాగే వేదాళం తెలుగు రీమేక్‌కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారు. వీటికి తోడుగా ఇప్పుడు మరో రీమేక్ వచ్చి చేరింది. తమిళ్లో సూపర్‌హిట్ అయిన ఎన్నై ఆరిందాలు అనే సినిమా తెలుగు రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్నారని సమాచారం. ఇలా వరసగా రీమేక్‌లు చేసుకుంటూ పోతే అవి తెలుగు సినిమాల్లా ఎలా అనిపిస్తాయి? చిరంజీవి సినిమాలు ఎలా అనిపించుకుంటాయి? అని అభిమానులు వాపోతున్నారు. ఏది ఏమైనా తెలుగు కథలను కాదని, ఇలా ఇతర భాషల కథలకు ప్రాధాన్యం ఇవ్వడం మెగాస్టార్ చిరంజీవిలాంటి హీరోకి తగదని అందరూ అభిప్రాయపడుతున్నారు.













