ఈ సంక్రాంతికి రెండూ పాన్ ఇండియా సినిమాలే! ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల జాతర!!
సంక్రాంతి పండుగంటే తెలుగువారికే కాదు సినీ పరిశ్రమకు కూడా పెద్ద పండుగే. ఏడాది ఆరంభంలో మూడు రోజులపాటు వచ్చే ఈ పెద్ద పండుగను పురస్కరించుకుని థియేటర్లలో సినిమాల జాతర మామూలుగా ఉండదు. భారీ వసూళ్లు.. రికార్డ్స్ బ్రేక్.. ఇలాంటి సంబరాలకు సంక్రాంతి పండుగ పెట్టింది పేరు. ఎంతోమంది స్టార్ హీరోలు ఈ సంక్రాంతి రేసులో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. బిగ్ ఫెస్టివ్ రేసుకి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఇంతకీ ఎవరా హీరోలు? ఏమా చిత్రాలు? మీరూ ఓ లుక్కేసేయండి..! కాగా, వచ్చే 2022 ఏడాది సంక్రాంతికి ముందుగా అనుకున్న ప్రకారం నాలుగు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలు ప్రకటించారు. నాలుగు చిత్రాల్లో రెండు వెనక్కి తగ్గగా రెండు పాన్ ఇండియా సినిమాలు మాత్రం సంక్రాంతి భరిలో నిలిచాయి. ఇందులో మూడేళ్ళ నుండి షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియా మూవీస్ ఆర్ఆర్ఆర్ మొదటిది అయితే, రెండవది రాధే శ్యామ్. అయితే చివరాఖరికి ముగ్గురు స్టార్‌హీరోలు ప్రభాస్, ఎన్టీర్- రామ్ చరణ్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు.
పాన్ వరల్డ్ రేంజ్లో ‘ఆర్ఆర్ఆర్‘
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ . ఎంటైర్ ఇండియా ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తోంది. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్లో 10 భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం పై ఎన్నో అంచనాలు వున్నాయి. చరిత్రలో కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుంటే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తె రకెక్కించారు. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా ఇద్దరి గెట్ అప్స్ అదిరిపోయాయి. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నాలుగు వందల కోట్ల రూపాయలతో సినిమాను నిర్మించారు. అమెరికాలో భారీగా 2022 జనవరి 6న ప్రీమియర్ షో తో విడుదల అవుతున్న ఆర్ఆర్ఆర్ ప్రదర్శించబోయే థియేటర్ లిస్ట్ వచ్చేసింది. ఈ నెల 20 నుండి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు.
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ సంక్రాంతి రేస్ కొత్తేమీ కాదు. ‘వర్షం’ (2004), ‘యోగి’ (2008) చిత్రాలతో ప్రభాస్ ఇప్పటికే సంక్రాంతి రేస్ తన సత్తా ఏమిటో నిరూపించాడు. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి పాన్ ఇండియా మూవీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. వింటేజ్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచంలో పేరొందిన జోతిష్య శాస్త్రవేత్త విక్రమాదిత్య గా, పూజాహెగ్డే కథానాయిక. గా, కృష్ణంరాజు హిందూమతం సెయింట్ గా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి రోజున జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ ఈ చిత్రానికి వర్క్ చేసాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు రికార్డు చేసారు. ఈ చిత్రం లో ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ హాలీవుడ్ సినిమా రేంజ్ లో వున్నాయి. బిల్లా రంగా చిత్రం తరువాత గోపి కృష్ణా మూవీస్ బ్యానర్ లో కృష్ణంరాజు సమర్పిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు, ట్రైలర్ కు మంచి అప్లాజ్ వచ్చింది.
సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న ‘సర్కారు వారి పాట‘
సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు సంక్రాంతి రేస్ కొత్తేమీ కాదు. ఆయన నటించిన చాలా సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. 2002లో విడుదలైన ‘టక్కరిదొంగ’తో ఆయన మొదటిసారి పండుగ పోటీలో నిలబడ్డారు. అనంతరం ఆయన.. ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘1 నేనొక్కడినే’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నాడు. కాగా, తాజాగా మహేశ్ మరోసారి పరశురామ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురానున్నట్లు మొదట్లో విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే అనుకోకుండా ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా 2022 ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. ఈ చిత్రం లో కీర్తిసురేశ్ కథానాయిక. మహేష్ సర్జరీ కారణంగా ప్రస్తుతం దుబాయ్ లో కుటుంబసమేతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంకా సినిమా షూటింగ్ జరగాల్సింది వుంది.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంతో ‘భీమ్లా నాయక్’ వాయిదా
సంక్రాంతి పోటీలో నిలపడ్డ మరో చిత్రం ‘భీమ్లా నాయక్’ పవన్‌కల్యాణ్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం లో మరో కథానాయకుడు దగ్గుబాటి రానా కీలకపాత్రలో నటిస్తున్నారు. గతంలో ‘గోపాలగోపాల’ 2015లో సంక్రాంతి కానుకగా విడుదలై సత్ఫలితాలివ్వగా.. 2018లో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ మిశ్రమ స్పందనలందుకుంది. కాగా, ఇప్పుడు మళ్లీ ఆయన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌తో పండుగ పోటీలోకి అడుగుపెట్టి బోగి నాడు జనవరి 12న ప్లాన్ చేసారు. ఒక రోజు గ్యాప్ లో పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ విడుదల ఒక కారణం అయితే థియేటర్స్ సమస్య వస్తుందని ఊహించి ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాయిదా వేయించింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిత్యామేనన్-ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు తాజా తేదీ చిత్రబృందం ప్రకటించింది.
2022 ఫిబ్రవరి 4 న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య‘
ఆర్ఆర్ఆర్ తరువాత పై నాలుగు చిత్రాలకు ముందుగా విడుదల తేదీ ప్రకటించింది మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తొలుత అక్టోబర్, ఆ తరువాత డిసెంబర్ 17న ఈ మూవీ విడుదలవుతుందని వార్తలు వినిపించాయి. కానీ, 2022 ఫిబ్రవరి 4 న ఆచార్య చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న ఈ చిత్రంలో.. రామ్‌చరణ్ సిద్ధ అనే నక్సలైట నాయకుడిగా కనిపించబోతున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, తిరుణ్ణావుక్కరుసు సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్, సురేశ్ సెల్వరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు.
నిర్మాతలను దడపుట్టిస్తున్న ఒమిక్రాన్
మరో వైపు ఇప్పటికే రెండు చిత్రాలకు సంబంధించి ప్రమోషన్స్ భారీ రేంజ్లో జరుగుతున్నాయి. అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ షాకింగ్లాంట వార్తలు కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ వార్తలు ఏమిటంటే? ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు మళ్లీ వాయిదా పడబోతున్నాయని. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాల విడుదలకు అన్నీ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయిగా, మరెందుకు వాయిదా పడుతాయనే సందేహం రావచ్చు. అసలు విషయం ఏంటంటే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ కావడం, ఇప్పటి వరకు దక్షిణాదిన వచ్చిన సమస్యలేమీ లేవు. కానీ.. అసలు సమస్యంతా బాలీవుడ్లోనే మొదలైంది. ఎందుకంటే శుక్రవారం 2021 డిసెంబర్ 24న మహారాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే నైట్ షోస్ ఉండవు. అంతే కాకుండా మిగిలిన ఆటలను 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇలాంటి పరిస్థితులుంటే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలకు వసూళ్ల పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. దీనికి తోడు ఏ పి లో సినిమా టిక్కెట్ల రేటు తగ్గించడం, స్వచ్చందంగా 150 థియేటర్లవరకు ఈ రేట్లతో మేము థియేటర్లు నడపలేము బాబోయ్ అని మూసివేయడం ఆయా కారణాలతో సంక్రాంతికి రావలసిన నిజమైన కలెక్షన్స్ వస్తాయో లేదోనన్న ఆందోళనతో ఈ రెండు సినిమాలకు చెందిన మేకర్స్ వాయిదా వేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు కరోనా వేవ్స్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. ఈ మధ్య కాలంలో అంతా సర్దుకుంటుందనిపించింది. దీంతో మేకర్స్ వారి సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే మళ్లీ సినిమా ఇండస్ట్రీకి ఒమిక్రాన్ రూపంలో, టికెట్ రేట్ల తగ్గింపు తో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. మరి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ మేకర్స్, తమ సినిమాల కలెక్షన్స్ ఏ విధంగా రాబట్టుకుంటారో వేచి చూడాలి.
బాలకృష్ణ ‘అఖండ‘ విజయ పరంపర
మాస్ ఆడియన్స్ చేత ఈలలు గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసిన ‘అఖండ’ సినిమా విడుదల అయినా తొలి రోజు నుండి కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది. డిసెంబర్ 2న విడుదలై అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే కలెక్షన్స్ వచ్చాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ మూవీ తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఎంతగానో ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ సినిమా చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. విడుదలైన అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో US తో కలిపి ఈ సినిమాకు 130 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ వసూల్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తగా 200 కు చేరుకున్న ‘పుష్ప‘ కలెక్షన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ”పుష్ప: ది రైజ్” పార్ట్ 1 డిసెంబర్ 17 వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ్, మళయాలం, కన్నడ భాషల్లో ఒకే సారి భారీ స్థాయిలో విడుదల అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన మరియు యాక్షన్ సన్నివేశాలకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ అనే ఊర మాస్ అవతారంలో బన్నీ అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై నడిపించారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తో ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారని ఈ సినిమా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. పుష్ప: ది రైజ్’ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా అని.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వ్యాసం ప్రింట్ చేసే రోజు నాటికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన సినిమాగా పుష్ప ది రైజ్ సరికొత్త రికార్డు అందుకుంది
టిక్కెట్ల ధరల విషయం లో తెలంగాణ ప్రభుత్వం సంతోష పెట్టింది
ప్రస్తుతం సినిమా టికెట్ ధరల విషయమై అటు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ సర్కారు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలంగాణలోని అన్ని థియేటర్లలో సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయి. టికెట్లపై ధర, జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు, ఆన్లైన్ ఛార్జీలను వేర్వేరుగా ముద్రించాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల తెలుగు సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం ఇవీ ఛార్జీలు..
ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్ ధరను నిర్ణయించారు. (జీఎస్టీ అదనం)
మల్టీప్లెక్స్‌ల్లో మినిమం టికెట్ ధర రూ.100+జీఎస్టీ, గరిష్ఠంగా రూ.250+జీఎస్టీగా ధరను ఖరారు చేశారు.
సింగిల్ థియేటర్లలో స్పెషల్ రిక్లైనర్ సీట్లకు రూ.200+ జీఎస్టీ.. మల్టీప్లెక్స్‌లలో రూ.300+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లలో రూ.5, నాన్ ఏసీకి రూ.3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
టిక్కెట్ల ధరల విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లను మూయించింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్స్ ధరలు పెంచడానికి అనుమతి ఇస్తే దానికి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త టికెట్ ధరలను ప్రకటించింది. అగ్ర సినిమాల రిలీజ్ ముందే ప్రభుత్వ ప్రకటన ఆసక్తికరంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమకు జగన్ సర్కారు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే బెన్ఫిట్ షోలకు అనుమతులు రద్దు చేసిన జగన్ సర్కారు.. తాజాగా, మరో షాకిచ్చింది. సినిమా టికెట్లకు సంబంధించి ఇటీవలే ఆన్లైన్ సినిమా టికెటింగ్ విధానం జి ఓ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త ధరలను బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. అగ్ర హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్న తరుణంలో టికెట్ల ధరలపై కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు వివిధ రకాల రేట్లను నిర్దేశించింది. సవరించిన ధరల ప్రకారం… అత్యంత కనిష్ట ధర 5 రూపాయిలు కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండబోదని తేల్చిచెప్పింది.
జగన్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త ధరలు ఇవే..
మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో…
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ. 250, డీలక్స్ రూ. 150, ఎకానమీ రూ. 75
ఏసీ/ ఎయిర్ కూల్: ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ: ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20
మున్సిపాలిటీ ప్రాంతాల్లో…
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ ఎయిర్ కూల్: ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ: ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీల్లో…
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ: ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో…
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ: ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ. 5













