అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తి చిచ్చు
ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వ్యవహారాలు ఒక్కోసారి ఎంతటి సన్నిహిత బంధాలనైనా దెబ్బతీస్తాయి. తాజాగా అలనాటి హీరోయిన్లు రాధ(radha), అంబిక(Ambika)ల మధ్య నెలకొన్న వివాదం ఈ విషయాన్నే మరోసారి చర్చకు తెచ్చింది. ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో అక్కాచెల్లెళ్లుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరి మధ్య ఆస్తి, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. తన సైన్ తో ఉన్న పాత చెక్కులను దుర్వినియోగం చేసి భారీ మొత్తాన్ని పొందేందుకు ప్రయత్నం జరిగిందంటూ రాధ చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు.
రాధ ఫిర్యాదు ప్రకారం.. బిజినెస్ అవసరాల కోసం ఏఆర్ఎస్ స్టూడియో పేరుతో ఉన్న కరెంట్ అకౌంట్ ను ఆమె నిర్వహించేవారు. ఉద్యోగుల శాలరీలు, ట్యాక్సులు, ఇతర చెల్లింపుల కోసం కొన్ని చెక్కులపై ముందుగానే సంతకాలు చేసి ఇంట్లో భద్రపరిచేవారట. అయితే 2025 జనవరిలో కంపెనీ పేరుని ఆర్ఆర్ గార్డెన్స్ గా మారిన తర్వాత ఆ పాత చెక్కుల వినియోగాన్ని నిలిపివేశారు. ఈ క్రమంలో పాత చెక్‌బుక్ నుంచి ఐదు చెక్కులు కనిపించకుండా పోయాయని, వాటిని తన చెల్లి అంబిక, సోదరుడు మల్లికార్జున్ కుంజన్ నాయర్ ఉపయోగించారని రాధ ఆరోపించారు.
సెప్టెంబర్ 17న అంబిక పేరుతో మొత్తం రూ.46 కోట్ల విలువైన ఐదు చెక్కులు బ్యాంకులో సమర్పించినట్లు సమాచారం అందిందని రాధ పేర్కొన్నారు. వెంటనే బ్యాంకును సంప్రదించి వాటి చెల్లింపులను నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు. అంబికకు తాను అలాంటి చెక్కులు ఇవ్వలేదని, అంత భారీ మొత్తానికి సంబంధించి ఎలాంటి డీల్ కూడా లేదని స్పష్టం చేశారు. దాంతో పాటూ తన ఆస్తిలోకి సుమారు ఏడాదిన్నరగా వెళ్లేందుకు అనుమతించడం లేదని, అక్కడ విలువైన వస్తువులు, నగలు, పత్రాలు ఉన్నాయని రాధ వెల్లడించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.








