సురేఖావాణి గురించి సుప్రీత… సుప్రీత గురించి సురేఖ..
వాళ్లిద్దరూ షార్ట్స్ ధరించి డ్యాన్స్ చేస్తే నెటిజన్లు ఉర్రూతలూగారు. ఇప్పుడు థోతీ కట్టి టిక్‌టాక్ మంటూ సందడి చేస్తూ మరోసారి సోషల్ న్యూస్‌లో నిలిచారు. కుమార్తెతో కలిసి డ్యాన్సులు, పాటలతో సోషల్ వేదికలపై హల్చల్ చేస్తూ మోడ్రన్ మదర్ సురేఖావాణి…లాక్ డవున్తో మరింతగా తన కూతురితో కలిసి గడుపుతున్నారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ 6లోని ససురాల్ పాటకు కూతురితో జోడీ కట్టి…థోతీ కట్టి మరీ టిక్‌టాక్ చేసిన ఈ తల్లీ కూతుర్లు పంచుకున్న కబుర్లు ఇవి…
పేరెంట్స్ పెంచినట్టే…కూతుర్ని పెంచుతున్నా
తల్లి దండ్రులంటే గౌరవంతో కూడిన భయం ఉండాలనేది నా అభిప్రాయం. నాకు అమ్మతో ఏదైనా సరే పంచుకునే చనువు ఉండేది. నా కూతురుతో కూడా నేను అలాగే ఉంటున్నాను. తనను చిన్నప్పటి నుంచీ నాతో అరమరికలు లేకుండా ఉండేలా అలవాటు చేశాను. ఇద్దరం కలిసే షాపింగ్స్‌కి, టూర్స్‌కి, మూవీస్‌కి, పార్టీస్‌కి, పబ్స్‌కి వెళతాం. నాకు డ్యాన్స్ బాగా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు తనతో కలిసి చేసేదాన్ని. ఒకసారి అలా చేసిన డ్యాన్స్ సరదాగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే బాగా వైరల్ అయింది అప్పటి నుంచి ఖాళీ దొరికనప్పుడల్లా డ్యాన్సుల వీడియోలు, టిక్‌టాక్ చేస్తున్నాం. అయితే అవన్నీ స్పాంటేనియస్‌గా చేస్తున్నవి మాత్రమే. తను తన ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటుందో అలానే నాతో కూడా ఉంటుంది. ఇద్దరం ప్రేమాభిమానాలతో పాటు మర్యాద కూడా ఇచ్చి పుచ్చుకుంటాం. పిల్లలకూ తగిన గౌరవం ఇవ్వాలనేది నా పద్ధతి. నాకైతే తనను సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదు. ఒకవేళ తనకు ఉంటే కాదనను. నాకు ఖాళీ దొరికితే తనతో స్పెండ్ చేయడం ఇష్టం. ఇప్పుడు లాక్ డవున్తో ఇంకా ఎక్కువ టైమ్ గడపగలుగుతున్నా.
–సురేఖావాణి
సినిమాలు ఓకె.. కెరీర్‌గా నాట్ ఓకె..
మామ్‌ను మించిన ఫ్రెండ్ ఇంకెవరూ లేరు. ఫ్రెండ్స్‌తో ఎంత బాగుంటానో అమ్మతో అంతకన్నా బాగుంటాను. మామ్ నాకన్నా బాగా డ్యాన్స్ చేస్తుంది. తనతో డ్యాన్స్ చేస్తుంటే చాలా హాయిగా స్వేఛ్చగా అనిపిస్తుంది. నేను నేనుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా తను బాగా బిజీగా ఉంటుంది. ఒకవేళ తనకు ఖాళీ దొరికినా నాకు దొరకక పోవడం వంటివి ఉండేవి. ఇప్పుడు ఇద్దరం ఖాళీయే కాబట్టి ఫుల్‌గా టైమ్ పాస్ చేస్తున్నాం. ఓ 20 దాకా టిక్ టాక్‌లు చేసుంటాం. మామ్ వంట బాగా చేస్తుంది. తనకి స్నాక్స్‌గా సమోసాలు, గ్రిల్డ్ చికెన్ వంటి స్నాక్స్ కుక్ చేసి ఇవ్వడం నాకు చాలా ఇష్టం. తనెప్పుడూ నాకు అది చేయ్ ఇది చేయెద్దు అని చెప్పలేదు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, మ్యూజిక్ వీడియోలు చేస్తున్నా. సినిమాల్లో చేయమని ఆఫర్లు వస్తున్నాయి. తెలిసినవారు కొందరు అడిగారు. మంచి పాత్రలైతే చేద్దామని ఉంది. అయితే సినిమాలను కెరీర్‌గా తీసుకునే ఆలోచన మాత్రం లేదు.
–సుప్రీత













