ఎల్లమ్మ కోసం డీఎస్పీ స్పెషల్ ప్లాన్!
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్(Devi sri prasad) హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ఎల్లమ్మ (Yellamma)పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బలగం(Balagam)తో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి(Venu Yeldandi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు(Dil Raju) సమర్పణలో శిరీష్(Sirish) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా మేకర్స్ వెల్లడించిన మ్యూజిక్ అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాకు హీరోగా నటించడంతో పాటు సంగీత బాధ్యతలను కూడా దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా నిర్వహిస్తున్నారు. కథలోని తెలంగాణ గ్రామీణ నేపథ్యం, భారతీయ జానపద సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ టైటిల్ సాంగ్‌ను స్పెషల్ గా రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది సంప్రదాయ జానపద రిథమ్ కళాకారులతో ఒకే స్టేజ్ పై సాంగ్ ను రికార్డ్ చేయించారు. సహజమైన జానపద వాయిద్యాలు, స్థానిక సంగీత శైలుల సమ్మేళనంతో ఈ సాంగ్ ను రూపొందించడం విశేషం. డీఎస్పీ చేసిన ఈ సరికొత్త ప్రయత్నం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.
ఇక భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ టైటిల్ సాంగ్‌ను త్వరలోనే ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎలా మెప్పిస్తారు? వేణు యెల్దండి మరోసారి తనదైన నేటివిటీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.








