Indian Millionaires: ఇండియా నుంచి ఎగిరిపోతున్న కోటీశ్వరులు!
భారతదేశం 2028 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది. అదే సమయంలో దేశంలోని సంపన్నులు (Indian Millionaires) మాత్రం విదేశాలకు వలస వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మెరుగైన జీవనశైలి, సురక్షితమైన వాతావరణం, పన్ను మినహాయింపులు, పిల్లల ఉన్నత విద్యావకాశాల కోసం భారతీయ కోటీశ్వరులు విదేశాల వైపు చూస్తున్నారు. హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక ప్రకారం, 2024లో సుమారు 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లగా, ఈ సంఖ్య 2025లో 4,300 ఉండొచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల (Indian Millionaires) వలసల్లో చైనా, యూకే తర్వాత భారత్ మూడవ స్థానంలో ఉంది. ముఖ్యంగా యూఏఈ (UAE) వారి ప్రధాన గమ్యస్థానంగా మారుతోంది. ఆ తర్వాత అమెరికా, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గత మూడేళ్లలో (2022-24) దాదాపు 18,300 మంది మిలియనీర్లు (Indian Millionaires) భారత్‌ను వీడారు. దీనివల్ల దేశం సుమారు రూ. 1.50 లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్లయ్యింది. అయినప్పటికీ భారత్‌లో కొత్త సంపన్నుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






