Intel: ఇంటెల్‌లో ఉద్యోగ కోతలు

ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ (Intel) మరోసారి ఉద్యోగుల తొలగింపులను చేపట్టనుంది. మార్చిలో కంపెనీ సీఈఓగా లిప్‌బు టాన్ (Lipbu Tan) బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ఉద్యోగులు తొలగింపుపై దృష్టి పెట్టారు. జులై నుంచి మొదలు కానున్న ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ తన కార్యకలాపాలను క్రమబద్దీకరించి, పోటీ తత్వాన్ని పెంచే వ్యూహాత్మక ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. లేఆఫ్ (Layoff) విషయాన్ని కంపెనీ వర్గాలు ధృవీకరించాయి. ఎంత మందిని తొలగిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఉద్యోగులను తొలగిస్తున్నారన్న విషయాలను మాత్రం వెల్లడిరచలేదు. ప్రధానంగా కంపెనీ పీసీలు, ల్యాప్‌ట్యాప్ (Laptop)ల విక్రయాలు తగ్గడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎన్విడియా, ఏఎండీ (NVIDIA) కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఇంటెల్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా ఆర్థికంగా వెసులుబాటు కల్పించుకోవాలని భావిస్తోంది.