దుబాయ్లో ‘ప్రీకాన్’ ఏఐ ఆధారిత నిర్మాణ సాంకేతిక వేదిక లోగోను ఆవిష్కరించిన భారత కాన్సుల్ జనరల్
👉🏻 సందీప్ మక్తాల సమన్వయంతో యూఏఈలో అడుగుపెట్టిన కెనడా–భారత్ ఏఐ టెక్నాలజీ సంస్థ
👉🏻 రాస్ అల్ ఖైమా, షార్జా ప్రభుత్వాలతో కీలక చర్చలు… జీసీసీ మార్కెట్ విస్తరణ దిశగా ‘ప్రీకాన్’
దుబాయ్: మధ్యప్రాచ్య నిర్మాణ రంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో రూపొందించిన ‘ప్రీకాన్ (Preekon)’ ఏఐ ఆధారిత నిర్మాణ సాంకేతిక వేదిక లోగోను భారత కాన్సుల్ జనరల్ డా. ఈ. విష్ణువర్ధన్ రెడ్డి, ఐఎఫ్ఎస్ దుబాయ్లో అధికారికంగా ఆవిష్కరించారు.
కెనడా, భారత్కు చెందిన టెక్నాలజీ నిపుణులు అభివృద్ధి చేసిన ప్రీకాన్, నిర్మాణ ప్రాజెక్టుల ప్రణాళిక, వ్యయ అంచనాలు, డ్రాయింగ్ విశ్లేషణ, టెండర్ డాక్యుమెంట్ పరిశీలన, ప్రాజెక్టు నిర్వహణ వంటి కీలక ప్రక్రియలను కృత్రిమ మేధస్సు ద్వారా వేగవంతం చేసి, నిర్మాణ రంగంలో సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించబడింది.
ఈ సందర్భంగా మాట్లాడిన డా. ఈ. విష్ణువర్ధన్ రెడ్డి భారత్, కెనడా, యూఏఈ దేశాల మధ్య ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, సాంకేతిక భాగస్వామ్యాలు మరింత బలోపేతం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థలకు యూఏఈ అత్యుత్తమ వేదికగా ఎదుగుతోందని, ఇలాంటి వినూత్న సంస్థలు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని అభినందించారు.
ప్రీకాన్ యూఏఈ మార్కెట్లో ప్రవేశించేందుకు అవసరమైన వ్యూహాత్మక సమన్వయం, ప్రభుత్వ సంస్థల అనుసంధానం, వ్యాపార భాగస్వామ్యాలు, బ్రాండింగ్, మార్కెట్ విస్తరణ కార్యక్రమాలను సందీప్ మక్తాల సమన్వయం చేశారు. ఆయన కృషితో యూఏఈలోని ప్రభుత్వ, ఇన్నోవేషన్, పరిశ్రమలతో కీలక సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లభించింది.
ప్రీకాన్ సహ వ్యవస్థాపకులు శ్రీధర్ గొనెపల్లి (సన్నీ), ఉమా మహేష్ ముక్కరా. వీరిద్దరూ ఉత్తర అమెరికాలో 25 సంవత్సరాలకు పైగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో విశేష అనుభవం కలిగి ఉండి, జీసీసీ దేశాల నిర్మాణ రంగానికి అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతో ఈ వేదికను అభివృద్ధి చేశారు.
లోగో ఆవిష్కరణ అనంతరం ప్రతినిధి బృందం రాస్ అల్ ఖైమా ప్రభుత్వం ఆధ్వర్యంలోని అధికారులతో సమావేశమైంది. ప్రస్తుతం రాస్ అల్ ఖైమాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ, పారిశ్రామిక, పర్యాటక, మౌలిక సదుపాయాల రంగాలను దృష్టిలో ఉంచుకుని, ప్రీకాన్ ప్రాంతీయ కార్యకలాపాలను అక్కడ ప్రారంభించే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఏఐ ఆధారిత నిర్మాణ సాంకేతికతకు పూర్తి సహకారం అందించేందుకు రాస్ అల్ ఖైమా అధికారులు సానుకూలంగా స్పందించారు.
అనంతరం ప్రతినిధి బృందం షార్జా ప్రభుత్వానికి చెందిన షార్జా రీసెర్చ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్క్ (SRTIP) నాయకత్వంతో సమావేశమైంది. కృత్రిమ మేధస్సు, నిర్మాణ సాంకేతికత, పరిశోధన, స్టార్టప్ ఆవిష్కరణలు, సాంకేతిక భాగస్వామ్యాలపై జరిగిన ఈ సమావేశంలో, ప్రీకాన్ వంటి ఏఐ ఆధారిత పరిష్కారాలకు షార్జాలో విస్తృత అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రీకాన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ గొనెపల్లి మాట్లాడుతూ, “నిర్మాణ రంగాన్ని కృత్రిమ మేధస్సుతో మరింత సమర్థవంతంగా మార్చాలనే లక్ష్యంతో ప్రీకాన్ను రూపొందించాం. యూఏఈలోని ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం మా విస్తరణకు గొప్ప అవకాశాలను కల్పిస్తోంది. జీసీసీ దేశాల్లో నిర్మాణ రంగానికి ప్రపంచ స్థాయి ఏఐ పరిష్కారాలను అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.
ప్రీకాన్ లోగో ఆవిష్కరణతో పాటు రాస్ అల్ ఖైమా, షార్జా ప్రభుత్వాలతో జరిగిన వ్యూహాత్మక సమావేశాలు, కెనడా–భారత్–యూఏఈ దేశాల మధ్య కృత్రిమ మేధస్సు, నిర్మాణ సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణల రంగంలో కొత్త భాగస్వామ్యాలకు బాటలు వేసినట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








