పశ్చిమ ప్రకాశం దశాబ్దాల కల తీరబోతోంది..!
కరువు కోరల్లో చిక్కుకుని, తాగడానికి చుక్క నీరు లేక, ఫ్లోరైడ్ రక్కసితో అల్లాడిపోతున్న పశ్చిమ ప్రకాశం (కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా) ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ నెలాఖరులోనే కృష్ణా జలాలను విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వర్షాధారం మినహా మరే ఇతర నీటి సౌకర్యం లేని మెట్ట భూముల్లో త్వరలోనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుండటంతో స్థానిక రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీశైలం సమీపంలోని కృష్ణానది కొల్లంవాగు నుంచి నీటిని తరలించేందుకు నల్లమల కొండల్లో నిర్మించిన 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు సమాంతర సొరంగాల్లో.. రెండో సొరంగానికి సంబంధించిన చివరి విడత లైనింగ్ పనులు ప్రస్తుతం ముగింపు దశకు వచ్చాయి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీలోగా ఈ మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేసేలా అధికారులు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఈ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడంపైనే నీటి విడుదల ఆధారపడి ఉంది.
ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. జూరాల నుండి వస్తున్న ఈ వరద నీటిని పక్కాగా వాడుకుని, నల్లమల సాగర్ కాలువ ద్వారా నీటిని వదిలేందుకు లీన్ పీరియడ్ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల సరిహద్దుల్లోని కొండల మధ్య సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల ఆనకట్టల ఆధారంగా నిర్మించిన నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు ఈ 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాల్వ ద్వారా నీరు చేరనుంది. ఆగస్టు 17న పనులు పూర్తయిన వెంటనే, ఈ నెలాఖరుకల్లా మార్కాపురం, కనిగిరి ప్రాంతాల దాహార్తిని తీరుస్తూ వెలిగొండ జలాలు విడుదల కానున్నాయి.








