Zelensky: అమెరికా ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నాం

అమెరికా ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నానని, ఆ దేశం అందించిన అన్ని రకాల సాయానికి కృతజ్ఞతతో ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) అన్నారు. అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకూ సిద్ధమని చెప్పారు. శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump), జెలెన్‌స్కీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అమెరికాకు కనీసం ధన్యవాదాలు కూడా చెప్పలేదని ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance )లు జెలెన్‌స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఖనిజాల ఒప్పందం (Minerals Agreement ) పై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ వెనుదిరిగారు. ఈ క్రమంలో అమెరికా (America) పట్ల ఆయన స్వరం మారడం గమనార్హం. అమెరికా ప్రాధాన్యాన్ని మేం అర్థం చేసుకున్నాం. అమెరికాకు మాకు అందించిన అన్ని రకాల సహాయానికి కృతజ్ఞతతో ఉన్నాం. మేం అమెరికా పట్ల గౌరవభావంతో లేని రోజంటూ లేదు. మా స్వాతంత్య్ర పరిరక్షణకు, ఉక్రెయిన్‌లోని మా ప్రస్తుత స్థితికి మా భాగస్వామి ఏం చేశారు, అదే సమయంలో వారి సొంత భద్రత కోసం ఏం చేశారనేదానిపై ఈ కృతజ్ఞత ఆధారపడి ఉంటుంది అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.