మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచన లేదు : బైడెన్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో భయపడాల్సిన పనిలేదని, అందువల్ల అమెరికాలో విస్తృతంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆలోచించడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు బూస్టర్ డోస్‌తో సహా పూర్తిగా టీకా పొందాలని, ఇండోర్‌లోను, బహిరంగ సమావేశాల్లోను మాస్కులు ధరించాలని, అప్పుడే వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తుందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా టీకా తీసుకోని ఐదేళ్ల అంతకు పైబడిన వారు 80 మిలియన్ వరకు ఉన్నారని, మిగిలిన వారు రెండో డోసు తరువాత ఆరునెలలకు బూస్టర్ డోసు పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి పర్యవసానంగా బైడెన్ పర్యటనను నియంత్రించే ప్రయత్నాలేమీ లేవని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికన్ ప్రజల క్షేమం కోసం ప్రస్తుతం విధించిన రోడ్డు రవానా ఆంక్షలను తొలగించే ప్రయత్నమేదీ లేదని బైడెన్ తెలిపారు.






