చైనా మల్టీ ఎంట్రీ వీసాలకు అమెరికా చెల్లుచీటీ?
వాషింగ్టన్ః బాగా పలుకుబడి కలిగిన కొందరు రిపబ్లికన్ పార్టీ సభ్యులు 10 ఏళ్ల చైనా మల్టీ ఎంట్రీ వీసాలకు ముగింపు పలికే ఒక బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. అమెరికా ఆర్థిక, పారిశ్రామిక వ్యవహారాలపై చైనా గూఢచర్య కార్యకలాపాలు నిలిపివేసిందని తేలేవరకూ ఈ మల్టీ ఎంట్రీ వీసాలను రద్దు చేయడం జరుగుతుందని ఆ సభ్యులు స్పష్టం చేశారు. వీసా సెక్యూరిటీ చట్టం పేరుతో ఈ బిల్లును సెనేటర్లు మార్షా బ్లాక్బర్న్, టామ్ కాటన్, రిక్ స్కాట్, టెడ్ క్రూజ్, మార్క్ రూబియో తదితరులు ప్రవేశపెట్టారు.
అమెరికా ఆర్థిక, పారిశ్రామిక వ్యవహారాలపై నిఘా పెట్టడాన్ని చైనా విరమించుకున్నదని అమెరికా విదేశాంగ మంత్రి నిర్ధారించడంతో పాటు, తైవాన్ పట్ల రెచ్చగొట్టే విధంగా, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడాన్ని కూడా చైనా మానుకోవాలని, అంతవరకూ 10 ఏళ్ల బి1, బి2 వీసాలను జారీ చేయడాన్ని ఆపేయడం జరుగుతుందని వారు తెలిపారు.
అమెరికా దేశానికి వ్యాపార నిమిత్తంగా గానీ, టూరిజం కోసం గానీ వచ్చే చైనీయులకు ఈ బి1, బి2 వీసాలను జారీ చేస్తారు. కాగా, రిపబ్లికన్లు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందితే, చైనీయులు పదేళ్ల వీసాల స్థానంలో ఒక ఏడాదికి మాత్రమే వీసా పొందగలుగుతారు. 2014 సంవత్సరానికి ముందు ఈ రకమైన వీసా పరిస్థితి అమలులో ఉండేది. ఇప్పుడు మళ్లీ అదే స్థితికి చేరుకోవడం జరుగుతోంది. అయితే, ఈ వీసా విధానం తైవాన్‌కు గానీ, హాంకాంగ్‌లోని కొందరు పౌరులకు గానీ వర్తించదు.






