రష్యాపై మరిన్ని ఆంక్షలు : అమెరికా
రష్యా నుంచి తుర్కియే, యూఏఈ, జార్జియాలతో జరిగే 150కి పైగా వ్యాపారాలపై అమెరికా ఆంక్షలు విధించింది. వాటికి సంబంధించిన వ్యక్తులపైనా నిషేదాజ్ఞలను అమల్లోకి తెచ్చింది. దీనికి ప్రతిగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు అమెరికా దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. రష్యా తన యుద్ధంలో వాడుకునే ఆయుధాలకు టెక్నాలజీ తుర్కియే నుంచి అందుతుందనే కారణంగా ఆ దేశంలోని వ్యాపారాలు, వ్యక్తులపై ఆంక్షలను అమెరికా విధించింది. దీంతో పాటు రష్యా ఇంధన వ్యాపారాన్ని అడ్డుకునేలా, భవిష్యత్తులో ఆ దేశానికి నగదు నిల్వలు అందుబాటులో లేకుండా, ఆయుధాల ఉత్పత్తిని నిరోధించేలా ఈ ఆంక్షలను అమల్లోకి తెచ్చామని అమెరికా విదేశాంగ శాఖ ఆంక్షల విభాగం అధిపతి జేమ్స్ ఓబ్రియన్ తెలిపారు.
యూఏఈకి చెందిన ఎల్ఎన్జీ గ్యాస్ కంపెనీపైనా ఆంక్షలు విధించినట్లు వెల్లడిరచారు. ఇందులో పలు రష్యా కంపెనీలకు భాగస్వామ్యముందని వివరించారు. ఈ ఆంక్షలపై రష్యా వెంటనే స్పందించింది. మాస్కోలోని అమెరికా ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ జెప్రీ సిలిన్, సెకండ్ సెక్రటరీ డేవిడ్ బెర్న్స్టిన్లను వారంలోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. గత ఏడాది అరెస్టయిన అమెరికా కాన్సులేట్ ఉద్యోగితో ఇంకా సంబంధాలు నెరపడమే దీనికి కారణమని పేర్కొంది.






