వారు భారత సరిహద్దుల భద్రతను గౌరవించాలి : రో ఖన్నా
భారత సరిహద్దుల భద్రతను చైనా గౌరవించాలని భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు రో ఖన్నా సూచించారు. భారత్ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. వారు (చైనా) భారత సరిహద్దును గౌరవించాలి. అందుకే నేను పశ్చిమ నౌకదళ కమాండ్‌కు వెళ్లాను. అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రంలో నావిగేషన్ స్వేచ్ఛగా ఉందని నిర్ధారించుకోవడానికి అమెరికన్ నేవీతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అమెరికా, భారత్ రెండూ ప్రజాస్వామ్య దేశాలని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. అవి మరింత మెరుగైన ప్రజాస్వామ్య దేశాలని నిరూపించుకునే అవకాశం ఉందన్నారు. భిన్నత్వాన్ని గుర్తిస్తూ మైనారిటీల హక్కులను కాపాడటం ఆ ప్రక్రియలో భాగమన్నారు. ప్రతి వ్యక్తికి సమానత్వపు హక్కు కల్పించడం ఇరు దేశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మంచి స్నేహితులుగా కొనసాగేందుకు ఇలాంటి చర్చలు ఎక్కువగా జరగాల్సి అవసరం ఉందని అన్నారు.






