నిరసనలతో అట్టుడుకుతున్న అగ్రరాజ్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్న డొనాల్డ్ ట్రంప్ వర్గీయులు వీధిపోరాటానికి దిగుతున్నారు. ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిప్పు రాజేస్తున్నారు. బైడెన్ వర్గీయులతో బాహాబాహీ తలపడుతున్నారు. ట్రంప్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. వాషింగ్టన్లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాలు తీవ్రంగా ఘర్షణపడ్డాయి. ఇందులో ఒక ఆందోళనకారుడు, ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు.
ఈ నెల 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తన ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో మోసం, అక్రమాలు జరిగాయని, ఫలితంగా కీలక రాష్ట్రాల్లో తనకు లక్షల ఓట్లు దక్కకుండా పోయాయని పదేపదే ఆరోపించారు.ఈ నేపథ్యంలో ట్రంపే గెలిచారంటూ ఆయన మద్దతుదారులు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (ఎంఏజీఏ) మార్చ్‌ని నిర్వహించారు. తమ నాయకుడు మరో నాలుగేళ్లు అధ్యక్ష పదవిలో కొనసాగాలని నినాదాలు చేశారు. ఓట్ల లెక్కలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థులతో వీధి పోరాటాలకు దిగే నయా ఫాసిస్టు ముఠా ప్రౌడ్ బాయ్స్ సభ్యులు కూడా వీరిలో ఉన్నారు.
ఈ నిరసన కార్యక్రమం రోజంతా ప్రశాంతంగా సాగింది. రాత్రి వేళ ట్రంప్ మద్దతుదారులకు, ప్రత్యర్థి నిరసకారులకు మధ్య వైట్‌హౌస్‌కు కొద్ది దూరంలోని ఫ్రీడం ప్లాజా వద్ద ఘర్షణలు జరిగాయి. పోటాపోటీ నినాదాలతో పరిస్థితి అదుపు తప్పింది. ట్రంప్ వ్యతిరేకులు, ఆయన మద్దతుదారులపై కోడిగుడ్లు విసిరారు. ప్లకార్డులు, టోపీలు, బ్యానర్లను లాక్కొని తగులబెట్టారు. రెండు వర్గాలవారు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. పోలీసులు వచ్చి, పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా 20 మందిని అరెస్టు చేశారు. ఈ గొడవల్లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ బృందానికి చెందిన ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు.






