సజావుగా అధికారం మార్పు, ట్రంప్ హామీ
అమెరికా క్యాపిటల్ ముట్టడి మద్దతుదారులపై అధ్యక్షుడి ఆగ్రహం
అమెరికా క్యాపిటల్‌లో తన మద్దతుదారులు ఇటీవల సృష్టించిన అల్లర్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఖండించారు. ఆ అల్లర్లు అమెరికాకు ప్రాతినిధ్యం వహించవని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడన్‌కు సజావుగా, పద్ధతిగా, ఎటువంటి సమస్యలూ లేకుండా అధికారాన్ని అప్పగించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
క్యాపిటల్‌లో ప్రవేశించవలసిందిగా ఆయన జన సమూహాన్ని కోరడం, వారు దౌర్జన్యంగా క్యాపిటల్‌ను చుట్టుముట్టడం జరిగిన ఒక రోజు తర్వాత ఆయన ఒక కొత్త వీడియో విడుదల చేస్తూ, అమెరికా ఇప్పటికీ, ఎప్పటికీ శాంతిభద్రతల దేశంగానే ఉంటుందని ప్రకటించారు.
‘‘అమెరికన్లందరిలాగే నేను కూడా ఈ విధ్యంసకాండను, అల్లర్లను, అరాచకాన్ని చూసి విపరీతంగా ఆందోళన చెందాను. క్యాపిటల్ భవనాన్ని కాపాడడానికి, చొరబాటుదార్లను వెళ్లగొట్టడానికి వెంటనే జాతీయ భద్రతా దళాన్ని, స్థానిక పోలీసులను వినియోగించాను’’ అని ఆయన వివరించారు. కొత్తగా రికార్డు చేసిన తన వీడియో ప్రసంగాన్ని వైట్ హౌస్ యూట్యూబ్‌లో ప్రవేశపెట్టి విడుదల చేసింది.
క్యాపిటల్ భవనంలో చొరబడిన ప్రదర్శనకారులు అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన కేంద్రాన్ని మలినపరిచారని ఆయన పేర్కొన్నారు. ‘‘హింసా విధ్వంసకాండలలో నిమగ్నమైనవారు మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదని గుర్తుంచుకోండి’’ అని ఆయన హెచ్చరించారు. ‘‘శాంతిభద్రతలను ఉల్లంఘించినవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని అంటూ ఆయన, ‘‘మనం ఉద్రిక్తభరితమైన ఎన్నికల్లో పాల్గొన్నాం. ఈ ఎన్నికల్లో భావోద్వేగాలు పేట్రేగిపోయాయి. అయితే, ఇప్పుడిక భావోద్వేగాలు చల్లారాలి. ప్రశాంత పరిస్థితులు నెలకొనాలి’’ అని ఆయన స్పష్టం చేశారు.
ఒక టెలిప్రాంప్టర్ ద్వారా ఆయన మాట్లాడారు. బుధవారం నాడు ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి ‘‘మీరంటే నాకు ప్రేమ’ అంటూ మాట్లాడిన మాటలకు, ఇప్పుడు మాట్లాడిన మాటలకు పోలికే లేదు.
ఒక పక్క తన రిపబ్లికన్ పార్టీ సభ్యుల నుంచి ఒత్తిడిని, మరోపక్క అభిశంసన అవకాశాన్ని ఎదుర్కొంటున్న ట్రంప్ ఎన్నికల ఫలితాలకు తల ఒగ్గారు. బైడన్‌కు సజావుగా, సున్నితంగా అధికారాన్ని అప్పగిస్తామని వాగ్దానం చేశారు.
అమెరికా 46వ అధ్యక్షుడుగా బైడన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షోభం, విధ్వంసకాండల మధ్య, గురువారం పొద్దున్నే అమెరికా కాంగ్రెస్ బైడన్, హ్యారిస్‌ల ఎలక్టోరల్ కాలేజ్ విజయాన్ని పరిశీలించింది.
‘‘ఫలితాలను కాంగ్రెస్ పరిశీలించినందువల్ల, ఈ నెల 20న కొత్త ప్రభుత్వం ప్రారంభం కాబోతోంది. నేనిప్పుడు సజావుగా, పద్ధతిగా, ప్రశాంతంగా బైడన్‌కు అధికారం అప్పగించడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
‘‘ఎప్పటి మాదిరిగానే అమెరికా తన కార్యక్రమాలతో ముందుకు సాగిపోవాలి. ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ నేను న్యాయబద్ధంగా చేయగలిగినంతా చేశాను. ఎన్నికలు సజావుగా ఉండాలన్నదే నా లక్ష్యం. అందుకే ఈ ప్రయత్నమంతా చేశాను. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడం కోసమే పోరాడాను‘‘ అని అధ్యక్షుడు తెలిపారు.
‘‘ఓటర్లందని గుర్తింపును, అర్హతను పరిశీలించడానికి వీలుగాను, ఎన్నికలపై ప్రజల నమ్మకం కొనసాగే విధంగాను ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని నేనిప్పటికీ గట్టిగా భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
సంస్కరించడానికి, లోటుపాట్లను చక్కదిద్దడానికి ఇది సరైన సమయమని అంటూ ఆయన, అమెరికన్లకు 2020 పెద్ద సవాలుగా పరిణమించిందని అన్నారు. ప్రాణాంతక మహమ్మారి అమెరికన్ల జీవితాలను అతలాకుతలం చేసిందని, లక్షలాది మంది జీవితాలను వారి ఇళ్లకే పరిమితం చేసిందని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, లక్షలాది మంది జీవితాలను పొట్టనబెట్టుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






