కమలా హారిస్ మేనకోడలుకు వైట్‌హౌస్ షాక్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ ఎప్పటినుంచో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా ఉంటూ మేనత్త కమలా హారిస్ ప్రతిష్టను ఉపయోగించుకుని వ్యక్తిగత బ్రాండ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రాబోయే రోజుల్లో మీనా ఈ తరహా ప్రచారపర్వానికి బ్రేక్ పడనుంది. అమెరికా ఉపాధ్యక్షురాలి పేరును వాడుతూ వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంపై మీనాను వైట్‌హౌస్ లీగల్ టీమ్ హెచ్చరించింది. ప్రస్తుతం వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన కమలా హారిస్ పేరు వాడుతూ మీనా హారిస్ సామాజిక మాథ్యమాల్లో సాగిస్తున్న ప్రచారం పట్ల ఉపాధ్యక్షురాలి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీనా ప్రచారం నైతిక సంప్రదాయాలకు లోబడి లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ప్రవర్తన మార్చుకోవాల్సి ఉందని మీనా హారిస్‌ను ఉద్దేశించి ఓ వైట్‌హౌస్ అధికారి ఘాటుగా వ్యాఖ్యానించారు. మీనా పాటించాల్సిన నూతన నిబంధనలను పలువురు న్యాయవాదులు ఆమెకు వివరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. న్యాయవాదిగా ఉంటూ వ్యాపారవేత్తగా ఎదిగిన మీనా హారిస్‌కు ఇన్‌స్టాగ్రాంలో ఎనిమిది లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. రాజకీయాల నుంచి వ్యక్తిగత అంశాల దాకా ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుంటారు. కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా సహా పలు చిన్నారుల పుస్తకాలను మీనా ప్రచురించారు. ఫెనామినల్ పేరుతో మహిళల ఛారిటబుల్ దుస్తుల బ్రాండ్‌ను ఆమె స్థాపించారు. ఇక తమ మేనత్త అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక రోజు ముందు మీనా తాజా పుస్తకం యాంబీషియస్ గర్ల్ విడుదలైంది.






