అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్న ఘటనకు సంపూర్ణ బాధ్యత వహిస్తూ ఆ దేశ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటల్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సీక్రెట్ సర్వీస్ విభాగ ఉద్యోగులకు ఈమెయిల్ పంపించారు. మాజీ అధ్యక్షునికి భద్రత కల్పించడంలో జరిగిన వైఫల్యానికి తాను బాధ్యత వహిస్తున్నానని, భారమైన హృదయంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ట్రంప్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి ఆమె కాంగ్రెస్ కమిటీ ముందు హాజరయ్యారు. కొన్ని గంటల పాటు కొనసాగిన విచారణలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల ప్రతినిధులు సంయుక్తంగా భద్రతా వైఫల్యంపై కింబర్లీ చీటల్ను నిలదీశారు. సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన ఆమె ఆ మరుసటి రోజే సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.






