చైనా, రష్యా అవకాశవాద పొత్తు : అమెరికా
అమెరికా, నాటోల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి పుతిన్ ఉపయోగపడతారని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆశిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కర్బీ వ్యాఖ్యానించారు. జిన్పింగ్ రష్యా పర్యటనను ఉద్దేశించి ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. చైనా, రష్యాలు నానాటికీ దగ్గరవుతున్నా ఆ రెండు దేశాలు ఇంకా కూటమి కట్టలేదనీ, కేవలం అవకాశవాద పొత్తును ఏర్పరచుకున్నాయని కర్బీ అన్నారు. ప్రపంచంలో మిత్రులను పొగొట్టుకున్న పుతిన్, చైనా అధ్యక్షుడి వల్ల ఏదో ఒరుగుతుందని ఆశిస్తున్నారనీ పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్లు కాల్పులు విరమించి, శాంతి చర్చలు ప్రారంభించాలనీ, అందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తాననీ జిన్పింగ్ అంటున్నారు. అయితే జిన్పింగ్ ఇంతవరకు ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను ఖండిరచలేదనీ, రష్యా నుంచి చమురు, గ్యాస్ కొంటూనే ఉన్నారనీ, అలాంటప్పుడు ఆయన నిష్పాక్షిక మధ్యవర్తిత్వం ఎలా వహించగలరని కర్బీ ప్రశ్నించారు. పుతిన్, జిన్పింగ్ సంయుక్త ప్రకటనలో ఐక్యరాజ్యసమితి నిబంధనలను అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారనీ, ఆ నిబంధనలను నిజంగా గౌరవిస్తే ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాలని కర్బీ అన్నారు.






