Pramila Jayapal: డొనాల్డ్ ట్రంపే బదులివ్వాలి : ప్రమీలా జయపాల్

స్టూడెంట్ వీసాల రద్దు, విదేశీ విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భారత సంతతికి చెందిన డెమోక్రాట్ ప్రమీలా జయపాల్ (Pramila Jayapal) మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలకు లేఖ రాశారు. దానిపై 130 మందికి పైగా డెమొక్రాట్లు (Democrats) సంతకాలు చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా వీసాల రద్దు వల్ల విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడుతుందని జయపాల్ అన్నారు. వీసా హోదా అనిశ్చితి అమెరికా విశ్వవిద్యాలయాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రద్దు చేసిన కొందరు విద్యార్థుల వీసా (Student visa)లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినా అదింకా అమలు కాలేదు. కొందరు విద్యార్థులు ఇంకా ఇమిగ్రేషన్ నిర్బంధంలో ఉన్నారు. భవిష్యత్‌లో మరిన్ని వీసా రద్దులు జరుగుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి అని లేఖలో పేర్కొన్నారు.