కీలక ఉత్తర్వులు జారీ చేయనున్న జో బైడెన్
మేడిన్ అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు సరఫరా వ్యవస్థలను పటిష్టపరిచేలా పలు కార్వనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకాలు చేయనున్నారు. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ఆధునీకరణకు కలిసివచ్చే వారితో ముందుకు సాగేందుకు నూతన యంత్రాంగం సంసిద్దంగా ఉందని సీనియర్ అధికారులు సృష్టం చేశారు. ఇక తాజా ఉత్తర్వుల్లో ఫెడరల్ ఏజెన్సీలు విధిగా దేశంలో తయారయ్యే ఉత్పత్తులనే సేకరించాలని పొందుపరిచారు. ఆర్థిక వ్వవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రభుత్వం 60,000 కోట్ల డాలర్లను వెచ్చించనుండటంతో ప్రభుత్వ సంస్థలు మేడిన్ అమెరికా ఉత్పత్తులనే సేకరించాలన్న తాజా ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అమెరికా ఉద్యోగులు, వ్యాపారులకు ఊతమిచ్చేలా ఈ చర్యలు అనివార్యమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థల కొనుగోళ్లకు సంబంధించి నూతన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారని వైట్‌హౌస్ తెలిపింది. ఆయా సంస్థలు ప్రస్తుత మేడిన్ అమెరికా చట్టాలను అమలు చేస్తున్న తీరు, అధ్యక్షుడి మేడిన్ అమెరికా లక్ష్యాలను సాధించేందుకు తీసుకోవాల్సిన సూచనలను తెలుపుతూ నివేదికలు పంపాలని కోరింది.






