అమెరికా బడ్జెట్ 6 ట్రిలియన్ డాలర్లు : బైడెన్

2022 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‍ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. ఆరు ట్రిలియన్ డాలర్లతో ఆయన బడ్జెట్‍ను రూపొందించారు. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ భారీ బడ్జెట్‍ను ప్రకటించారు. సంపన్న అమెరికన్లపై భారీ స్థాయిలో పన్నులు వసూల్ చేయనున్నారు. కార్పొరేట్ పన్ను 28 శాతానికి పెంచనున్నారు. దండిగా సంపాదిస్తున్న అమెరికన్లపై 39.6 శాతం ఆదాయపన్ను వసూల్ చేయనున్నారు. ప్రతిపాదిత బడ్జెట్‍లో పలు రకాల సామాజిక పథకాలను కూడా చేర్చారు. వాతావరణ మార్పులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఫండ్‍ను కూడా పెంచారు.
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఈ ఏడాది ప్రారంభంలో బైడెన్ భారీగా వెచ్చించి విజయం సాధించారు. దేశ లోటు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. అయితే తాజా బడ్జెట్ ప్రణాళికతో అది వచ్చే ఏడాదికి 1.8 ట్రిలియన్ డాలర్లకు పడిపోనుంది. అయినా కరోనా ముందు రోజులకంటే రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని సమచారం. అయితే బైడెన్ ప్రతిపాదించిన ఈ భారీ బడ్జెట్ ఉభయసభలలో ఆమోదం పొందాల్సి ఉంటుంది.