కరోనాపై జో బైడెన్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే కరోనా మహమ్మారి అంతానికి తన వ్యూహాలేంటో ఆవిష్కరించారు. పెను సవాలుగా మారిన కరోనా నియంత్రణపైనే ఆయన తన తొలి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలంతా వంద రోజులపాటు మాస్కులు ధరించాలనీ ఆదేశించారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్లేవారికి క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఇలా పలు నిబంధనలతో మహమ్మారిని రూపుమాపడానికి బైడెన్ పటిష్ట ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలను సందర్శించేవారూ.. ప్రయాణ సాధనాలను వినియోగించుకునేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని బైడెన్ పేర్కొన్నారు.
దేశంలో కరోనా స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యక్షునికి తెలియజేసేలా కొవిడ్-19 రెస్పాన్స్ కో ఆర్డినేటర్‌ను అధికారికంగా నియమించారు. వైద్య పరికరాలు, మాస్కులు, రక్షణ దుస్తులు, సిరంజీలు, సూచనలు.. ఇలా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో ఆయుధాలుగా ఉపయోపగడే ఏ వస్తువునైనా అత్యవసర ప్రాతిపదికన ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌పైన సంతకం చేశారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.






