దేశ భవిష్యత్తు కోసం పోరాడతా.. మీ మద్దతు కావాలి : కమలా హారిస్
అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ తరుణంలో మీ మద్దతుతో నేను దేశ భవిష్యత్తు కోసం పోరాడతానని మాటిస్తున్నా అని డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచే అవకాశమున్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ఇండియానా పోలిస్లో చారిత్రక జెటా ఫి బీటా ఆఫ్రో అమెరికన్ సొసైటీ సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గత 16 ఏళ్లుగా ఇండియానా రాష్ట్రంలోని ఓటర్లు డెమోక్రటిక్ అభ్యర్థికి పెద్దగా మద్దతివ్వడం లేదు. కానీ హారిస్ అభ్యర్థి అయ్యే అవకాశముందని తెలియగానే కొంత మార్పు కనిపిస్తోంది. ఒక మహిళ తన శరీరంపై తనే నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ తానేం చేయాలో ప్రభుత్వం చెప్పడం సరికాదు ( అబార్షన్ హక్కుల చట్టం గురించి). మనమేమి ఆషామాషీగా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నవంబరులో జరిగే ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేందుకు మీరంతా సహకరించాలి అని సమావేశంలో హారిస్ కోరారు.






