గ్రీన్‌కార్డుపై బిల్లు…భారతీయులకు లాభమే!
అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్తను అమెరికా ప్రభుత్వం అందించింది. అమెరికా ప్రభుత్వం తాజాగా బడ్జెట్ రీకన్సిలేషన్ బిల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ఇకపై గ్రీన్ కార్డు పొందేందుకు భారతీయులు ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వారు కొంత మొత్తం చెల్లించడం ద్వారా గ్రీన్‌కార్డు పొందొచ్చు. ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో దీనివల్ల లబ్ధి పొందనున్నారు. అయితే, దీనికి సంబంధించిన ప్రతిపాదిత బిల్లు చట్టరూపం దాల్చాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల్లో ప్రతి దేశానికీ ఏడు శాతం పరిమితి ఉంది. దీంతో హెచ్-1బీ పని వీసాలపై వచ్చిన వారు గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువ జనాభా కలిగిన భారత్, చైనా వలసదారులు ఈ నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ ప్రతిపాదిత బిల్లు కాపీని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయారిటీ డేట్ దాటి రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు 5000 డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందొచ్చు. అదే ఈబీ-5 వీసాదారులు అయితే 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు పొందేందుకు 2500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చెల్లించే సాధారణ రుసుముకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఈ బిల్లుపై సైరస్ డీ మెహతా అండ్ పార్ట్నర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ మెహతా మాట్లాడుతూ.. ఇది చాలా గొప్ప బిల్లు అని అన్నారు. ఈ బిల్లులో అవసరమైన అంశాలన్నీ లేకపోయినా.. భారతీయులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎంప్లాయిమెంట్ గ్రీన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి లాభం చేకూరుతుందని, ఇప్పటివరకు అమలులో ఉన్న పరిమితుల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే ఈ బిల్లు తుది బిల్లు కాదని, ఇందులో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తుది బిల్లు పార్లమెంట్‌కు చేరుతుందని, బిల్లులో చేసిన ఇమ్మిగ్రేషన్ నిబంధనల వల్ల దేశానికి లాభం చేకూరుతుందా లేదా అనే దానిపై సభ్యులు చర్చిస్తారని, అయితే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు బడ్జెట్ రికన్సిలేషన్ బిల్లులో భాగం కనుక దీనికి భారీ మెజారిటీ అవసరం లేదని మెహతా పేర్కొన్నారు.
బిల్లు చట్ట రూపం దాల్చితే అమెరికాకు చిన్నవయసులో వచ్చినవారు, తాత్కాలికంగా రక్షణ పొందినవారు, వ్యవసాయ కూలీలు, మహమ్మారి కాలంలో అత్యవసర కార్మికులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఓ విధంగా వీసాలపై ఉన్న పరిమితిని ఎత్తివేసినట్లేనని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






