అమెరికాలో ఎలాన్ మస్క్‌పై .. ఎన్నికల దావా
స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన ప్రైజ్‌మనీ విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఆరిజోనా నివాసి జాక్వెలిన్ అనే మహిళ మస్క్‌పై దావా వేశారు. ముందుగా ప్రకటించినట్లు లాటరీ ద్వారా ఎంపికచేసిన వ్యక్తులకు కాకుండా ముందే నిర్ణయించిన వారికి మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. అదేవిధంగా ఆయా వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరించడం, తన సోషల్ మీడియాకు వ్యూయర్షిప్ పెంచుకోవడంతో మస్క్‌కు లాభం చేకూరిందని జాక్వెలిన్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మస్క్ తరపు న్యాయవాదులు స్పందించ లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ప్రైజ్ మనీ పథకాలను మస్క్ ప్రకటించారు.






