131 ఏళ్ల తర్వాత ట్రంప్ సరికొత్త చరిత్ర
అమెరికా అధ్యక్ష పీఠాన్ని రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధిష్టించడం దాదాపు ఖాయమైంది. అయితే అగ్రరాజ్యంలో సాధారణంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు వరుసగా రెండోసారి విజయం సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, ఒక సారి ఈ పదవి చేపట్టి, రెండో సారి పరాజయం పాలై మూడోసారి పోటీ చేసి అధికారంలోకి రావడం అత్యంత అరుదు. ఇలాంటి రికార్డు సాధించిన రెండో వ్యక్తిగా ట్రంప్ నిలవనున్నారు. దాదాపు 131 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారు. 1892లో గ్రోవెర్ క్లీవ్‌ల్యాండ్ ఈ విధమైన విజయాన్ని అందుకున్నారు. తొలుత 1884 ఎన్నికల్లో గెలిచిన ఆయన 1888లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 1892లో మళ్లీ పోటీ చేసి రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇలాగే కొంత విరామం తర్వాత రెండోసారి శ్వేతసౌధంలోకి అడుగు పెట్టబోతున్నారు.






