Donald Trump: ట్రంప్ కొత్త ఆర్డర్స్.. మనపై ప్రభావమెంత?

అమెరికాలో రెండోసారి ప్రెసిడెంట్‌గా ట్రంప్(Donald Trump) వచ్చిన తరువాత ఇచ్చిన ఉత్తర్వులు ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న వలసదారులను వణికిస్తోంది. ఎప్పుడూ ఏమి జరుగుతుందోనన్న భయంతో చాలామంది వలసదారులు బిక్కుబిక్కుమనే పరిస్థితి ఉంది. అమెరికా(America) లో ఉంటున్న భారతీయులు, విద్యార్థులకు ట్రంప్ రాకతో కొన్ని అవకాశాలను వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన జారీ చేసిన ఉత్తర్వులు ఎవరికి ఎంతగా నష్టపరుస్తాయోనన్న విషయంపై వస్తున్న విశ్లేషణలను, క్రోడీకరించి తెలుగుటైమ్స్ ఈ ఆర్టికల్ ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఇక్కడ వివరించింది.
అమెరికాలో ఇప్పుడు ట్రంప్ శకం మొదలైంది. రెండోసారి ప్రెసిడెంట్‌గా ట్రంప్ వచ్చేశారు. పదవిని చేపట్టారు. అప్పుడు.. ఇప్పుడూ.. ట్రంప్ స్లోగన్ ఏమీ మారలేదు. ఇప్పుడు కూడా మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే అనడంతోపాటు ఈసారి తన పాలన మామూలుగా ఉండదనే సంకేతాలను తన తొలి ప్రసంగంలోనే స్పష్టం చేశారు. అమెరికా ఫస్ట్ అన్నదే తన నినాదం, విధానం కూడా అని చెప్పడంతోపాటు తన పాలనా అంశాల్లో అమెరికాకే తొలి ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు.
ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన ఏకంగా 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. ఇందులో ప్రపంచ దేశాలకు ఇబ్బందిని కలిగించే నిర్ణయాలు ఉన్నాయి. అలాగే భారత సంతతివారికి ఇబ్బందులు పెట్టేవి ఉన్నాయి. అలాగే అమెరికాలోని యూనివర్సిటీలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోలేక, ఖర్చుకు సరిపడా డబ్బులు సమకూర్చు కోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం అక్రమంగా వలస వచ్చిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది దొరికినవారిని విమానం లోకి ఎక్కించి వారి దేశానికి పంపేస్తోంది. దీంతో అక్రమంగా వలస ఉంటున్నవారి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమం టున్నారు. ప్రపంచదేశాలు ట్రంప్ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ట్రంప్ తాను అనుకున్నది చేస్తూపోతు న్నారు. దానికితోడు ఇమ్మిగ్రేషన్ అధికారుల కఠిన వైఖరి అమెరికాకు వెళ్ళాలనుకునే వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వైఖరి, ఉత్తర్వుల వల్ల కలిగే కష్టనష్టాలపై ఇక్కడ సమగ్రంగా కథనాన్ని అందిస్తున్నాము.
జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వుపై కోర్టుకు
ట్రంప్ జారీ చేసిన జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వును సవాల్ చేస్తూ అమెరికాలో డెమొక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయిం చాయి. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారికైనా.. సక్రమంగా విద్యార్థి/ఉద్యోగ/పర్యాటక వీసాపై వచ్చినవారికైనా అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆటోమేటిగ్గా ఆ దేశ పౌరసత్వం లభించేలా 1868లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా హక్కు కల్పించిన సంగతి తెలిసిందే. ఆ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన ఉత్తర్వు జారీ చేయగానే ఆ హక్కు రద్దు అయిపోదని.. ట్రంప్ సర్కారు దీనిపై చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఒకవేళ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ హక్కును రద్దు చేయాలనుకున్నా కూడా అది చాలా సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ అని హక్కుల కార్యకర్తలు స్పష్టం చేశారు. వారి మాటలను నిజం చేస్తూ అమెరికాలోని 22 రాష్ట్రాల అటార్నీ జనరళ్లు రెండు కోర్టుల్లో వ్యాజ్యాలు వేశారు. అమెరికా ప్రజాప్రతినిధుల సభ సభ్యులు, భారత సంతతికి చెందిన ఆర్‌వో ఖన్నా, శ్రీతానేదార్, ప్రమీలా జయపాల్ కూడా ట్రంప్ ఉత్తర్వులను ఖండించారు.
పారిస్ ఒప్పందం నుంచి వెనక్కి…
మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తున్న భూగోళం వేడెక్కడం సంబంధిత సంక్షోభాలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజం 2015 డిసెంబరులో పారిస్‌లో ఒక ఒప్పందానికి వచ్చింది. అనేక తర్జన భర్జనల అనంతరం 2016 సెప్టెంబరు లో అమెరికా ఈ ఒప్పందంలో చేరింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మరో సారి ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ఎప్పట్నుంచో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికా అభివృద్ధిని అడ్డుకునే కుట్రగా ఈ ఒప్పందాన్ని ఆయన గతంలో అభివర్ణిం చారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకే తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క పారిస్ ఒప్పందం నుంచే కాదు.. అమెరికా అభివృద్ధికి అడ్డంకిగా మారే అన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచీ వైదొలగేలా.. ‘యూన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్’కు సంబంధించి గతంలో అమెరికా ఏదైనా ఆర్థికసాయం అందిస్తానని ప్రకటించి ఉంటే వాటి నుంచి వైదొలగేలా ఉత్వర్వులు జారీ చేశారు.
అమెరికాతోపాటు ప్రపంచ దేశాలకు ఇబ్బందే
ట్రంప్ ప్రభుత్వం ఈ ఒప్పందం నుంచి వైదొలగడం వల్ల అమెరికాతోపాటు, ఇతర దేశాలకు ఇబ్బందికరమేనని చెప్పవచ్చు. పారిస్ ఒప్పందం అనేది ప్రపంచంలోని పలు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. పారిశ్రామికీకరణ జరగక ముందున్న ప్పటి కంటే 2 డిగ్రీల సెల్సియస్ తక్కువకు గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్న దేశాలలో అమెరికా ఒకటి. ఇప్పుడు పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగినందున వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అంతర్జాతీయ సహకారానికి ఆ దేశం దూరమవుతుంది. పెరుగుతున్న క్లీన్ ఎనర్జీ రంగంలో ఆర్థిక అవకాశాలను అమెరికా కోల్పోనుంది. కీలకమైన క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ ప్రపంచ మార్కెట్ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి, రెండు ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోంది. ఈ ఉపసంహరణ అమెరికాను అంతర్జాతీయ మిత్ర దేశాల నుండి దూరం చేస్తుంది. దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుంది. వాతావరణ సమస్యలపై ప్రపంచ సహకారం నుండి అమెరికా దూరమవుతుంది.
అమెరికాకు నష్టమే…
డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగడం వల్ల సభ్యదేశాలకు అందించే వ్యాధుల సమాచారం అమెరికాకు అందకుండా పోతుంది. ‘డబ్ల్యూహెచ్‌ఓ పాండెమిక్ ఇన్ ఫ్లుయెంజా ప్రిపేర్డ్‌నెస్ ఫ్రేమ్‌వర్క్’ ఆధారంగానే పలు అమెరికన్ ఫార్మా కంపెనీలు టీకా తయారీకి సంబంధించి కొత్త రకం వైరస్ నమూనాలు పొందుతూంటాయి. ఇకపై ఈ వివరాలు అందకపోవడం వల్ల ఫ్లూ వైరస్ నిరోధక టీకాపై ప్రభావం పడనుంది. కోవిడ్ లాంటి మహమ్మారుల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ చర్చల నుంచి కూడా అమెరికా వైదొలిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకూ డబ్ల్యూహెచ్‌ఓలో పని చేస్తున్న పలువురు అమెరికన్ నిపుణులను వెనక్కి పిలిపిస్తారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అనే రెండు అమెరికన్ సంస్థలతో డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటి వరకూ ఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యం ఇకపై ఉండదు. ఇది ఇరువర్గాలకూ చేటు చేస్తుందని అంటున్నారు.
భారతీయులకు ఇబ్బందే..
ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత జన్మత: పౌరసత్వం రద్దుపై సంతకం చేశారు. అమెరికాకు వలస వెళ్లిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగానే అమెరికా పౌరసత్వం వస్తుంది. చాలా మంది అమెరికాలో ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది గర్భిణీలుగా ఉంటూ.. డెలివరీ అమెరికాలో చేయించుకుంటున్నారు. కొంతమంది టూరిస్ట్ వీసాపై వచ్చి అమెరికాలో డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలా ఏదో ఒక విధంగా అమెరికాలో తమ పిల్లలకు పర్మనెంట్ పౌరసత్వం వచ్చేలా చేసుకుంటున్నారు. ఇది గమనించిన ట్రంప్.. దీని వల్ల అమెరికాకి అక్రమంగా వలసలు పెరుగుతున్నాయని అంటూ జన్మత లభించే పౌరసత్వానికి చెక్ పెడుతున్నట్లు చెప్పారు.
ఉద్యోగాల నిమిత్తం అమెరికాలో ఉంటూ.. అమెరికాలో పిల్లలను కనడం ద్వారా కనీసం వారికైనా పౌరసత్వం దక్కుతుందని ఆశిస్తున్న లక్షలాది మంది ప్రవాసభారతీయులకు ఈ ఉత్తర్వు అశనిపాతంగా కనిపిస్తోంది.
అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మత: పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం ఇక గుర్తించదు అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే.. తల్లిదండ్రుల్లో ఒకరికైనా యూఎస్ సిటిజన్ షిప్, శాశ్వత నివాసి, యూఎస్ మిలిటరీ సభ్యత్వం ఇలా ఏదోక గుర్తింపు ఉండాల్సిందేనని ట్రంప్ నిబంధన విధించారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అమెరికాలోని భారతీయులకు ఇబ్బందికర విషయమనే చెప్పొచ్చు. 2024 గణాంకాల ప్రకారం అమెరికాలో 54 లక్షల మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. అమెరికాలో విద్య, వైద్యం, ఐటీ రంగాల్లో రాణిస్తున్న భారతీయులు ఉన్నారు. ఉద్యోగాలు, విద్యావకాశాలు, వ్యాపారాలకోసం వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడంతో హెచ్1బీ, ఎఫ్1 వీసాలు, గ్రీన్ కార్డులపై భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.