హష్మని కేసులో ట్రంప్ అరెస్టు – విడుదల
ప్రపంచ వ్యాప్తంగా, ఎంతో మంది ఆత్రుతతో ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. నేడు మంగళవారం 4, ఏప్రిల్ 2023 ఉదయం న్యూయార్క్ రాష్ట్రం మన్ హటన్ నగరంలో ఉన్న న్యూయార్క్ రాష్ట్ర సుప్రీంకోర్టులో జరుగుతున్న హష్మని కేసు విచారణకు నిందితుడుగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు అయ్యారు. ఈ కేసులో నేటి విచారణకు రావటానికి సిద్దపడిన ట్రంప్ నిన్ననే ఫ్లోరిడా నుంచి తన సొంత విమానంలో న్యూయార్క్ నగరం చేరుకొన్నారు. నిన్న ట్రంప్, వచ్చినపుడు నేడు కోర్టుకు వచ్చిన దారిలో కూడా అనేక మంది రిపబ్లికన్లు, ట్రంప్ అభిమానులు ఆయనకు స్వాగతం చెబుతూ తమ మద్దతు తెలిపారు. అమెరికా చరిత్రలోనే దేశ అధ్యక్షుడు లేదా మాజీ అధ్యక్షుడు ఈవిధంగా నేర చరిత్ర సంబంధమైన కేసులో కోర్టు ముందర దోషిగా నిలబడడం ఇదే మొదటిసారి కనుక, అమెరికా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఈ కేసు ఆకర్షించింది అని చెప్పాలి.
మన్హటన్ మిడ్ టౌన్ లో ఉన్న ట్రంప్ టవర్‌లో ట్రంప్ రాత్రి బస చేశారు. దేశ అధ్యక్షుడి హోదాలో వస్తున్నట్లుగానే ఒక భారీ ఊరేగింపుతో అనేక కార్లతో అభిమానులు ఫాలో అవుతూ ఉండగా సుప్రీంకోర్టుకి చేరుకున్నారు. కానీ అయన అప్పటికే న్యాయపరంగా అరెస్టు అయి, వేలి ముద్రలు తీసుకున్నట్లుగా తెలిసింది.
అంతకు ముందే మన్హటన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉవాన్ మోర్బన్ తమ విచారణలో నేరారోపణ ముద్ర వేశారు. ఈ రోజు ట్రంప్ తన న్యాయవాదులతో కలిసి కోర్టుకి హాజరు అయ్యారు. అంతకు ముందే ప్రాసిక్యూటర్స్ ట్రంప్‌పై తమ వాదనను వివరించారు. ట్రంప్ న్యాయస్థానం లో నేను నిర్దోషిని అని చెప్పారు.
‘ఇది నమ్మకశ్యంగా లేదు. అమెరికాలో దేశ మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేయడం చాలా అవస్తావికంగా ఉంది’ అని ట్రంప్ తన సోషల్ మీడియా లో పోస్టు చేశారు. ట్రంప్ ఈ రోజు కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో కోర్టు ఆవరణ, చుట్టుపక్కల వీధులలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు ట్రంప్ ఏమి అంటున్నారు…
గత 3 నెలలుగా జరుగుతున్న ఈ న్యాయ విచారణపై ట్రంప్ తనదైన స్టైల్లో స్పందిస్తూ వస్తున్నారు. తనని అరెస్ట్ చేస్తే నిరసనలు చేయ్యాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. తనను అరెస్ట్ చేస్తే విధ్వంసం తప్పదని న్యాయస్థానానికి హెచ్చరికలు చేశారు. ఆ కేసుల న్యాయ విచారణ చేస్తున్న ప్రాసిక్యూటర్ ఓ డెమోక్రటిక్ అని అందుకే తనను ఈ విధంగా విచారణ చేస్తున్నారని, మీడియాకి లీక్ చేసి ఈ కేసులో తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు ట్రంప్ ఈ కేసుని తనని కేవలం నేరస్తుడుగా నిరూపించటానికి చేస్తున్న రాజకీయ కుట్ర అని చెప్పుతూ 2024 ఎన్నికలకు డబ్బు సీకరించడానికి అనేక ప్రణాళికలు తయారు చేశారు. క్రిందటి గురువారం 30 మార్చి 2023 రోజున గ్రాండ్ జూరి ఓటింగ్ జరిపి తనపై నేరారోపణ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 మిలియన్ డాలర్లు విరాళాలుగా సేకరించారని అధికారికంగా తేలిపారు. మన్హాటన్ లోని కోర్టు ఆవరణలో దగ్గరలో ఉన్న ఒక పార్క్ లో ట్రంప్ అభిమానులు అలాగే వ్యతిరేకించే వారు కూడా చేరి కోర్టు ప్రొసీడింగ్స్ చూశారు.
తాను ఎటువంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదించారు. న్యాయమూర్తి బాగ్ర్, తనని రాజకీయ కుట్రలో భాగంగా వేధిస్తున్నారని అభియోగించారు. ఇతను ముందు సోమవారం, 3 మార్చి 2023న ట్రంప్ తన సోషల్ మీడియాలో తనకు మన్హటన్ కోర్టులో న్యాయం లభిస్తుందన్న నమ్మకం లేదని అని, అవినీతిపరుడైన డిస్ట్రిక్ట్ అటార్నీ ఉండగా న్యాయమైన విచారణ జరగడం అసాధ్యం అని తెలిపారు.
హష్మని కేసు ఏమిటి?
2016 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయం ముందు ట్రంప్ తన ఎన్నికల ప్రచారానికి అనుకూలంగా, తన వ్యతిరేక ప్రచారాన్ని అణగదొక్కే విధంగా అనేక చట్ట పరమైన కుట్రలకు పాల్పడ్డారని, ప్రాసిక్యూటర్ క్రిస్ కాన్రాయ్ అప్పటి కోర్టుకు తెలిపారు. అసమయంలో ఓటింగ్ ప్రజల నుండి వాస్తవ సమాచారాన్ని దాచి పెట్టటానికి న్యూయార్క్ వ్యాపార రికార్డులను పదే పదే మార్చారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అంతే కాదు ట్రంప్ అసమయంలో తన పాత చరిత్రను బయటపెడతానని అన్న వారిని నివారించే ప్రయత్నంలో అధిక మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు అధార పూర్వకంగా నిరూపిస్తూ కోర్టులో వివరణ ఇచ్చారు.
ఈ హష్మని చెల్లింపు పోందిన ముగ్గురు వ్యక్తులను పూర్వాపరాలను న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చి వివరించడం జరిగింది. అడల్ట్ అండ్ పోర్న్ స్టార్, స్టార్నీ డేనియల్స్, ప్లేబాయ్ మోడల్ కరణ్ మెక్ డోగల్, ఇంకా ట్రంప్‌కి చెందిన అనేక రహస్య సంబంధాలు తెలిసిన ట్రంప్ టవర్‌లో ఉన్న డోర్ మెన్ లకు డబ్బు చెల్లించారని ఆధారాలతో కోర్ట్ ముందు ఉంచటం జరిగింది. ఈ ముగ్గురిలో ట్రంప్ న్యాయవాది మైఖెల్ కోహెన్ మొదటగా పోర్న్ స్టార్ స్టార్నీ డేనియల్స్ కి 13000 డాలర్లు చెల్లించారు. ఆ తరువాత మెక్ డోగెల్స్కు 150,000 డాలర్లు, డోర్ మెన్‌కు 30,000 డాలర్లు చెల్లించారు. ఆ తరువాత ట్రంప్ ఎన్నికలు అయ్యాక, అధ్యక్షుడిగా 2017లో అనేక అబద్ధమైన ప్రకటనలు అవాస్తమైన సమాచారం ఇచ్చారని మన్హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అలెన్ బ్రాగ్ చెప్పుతూ వచ్చారు.
పూర్తి అయిన ఈ రోజు విచారణ
కోర్టులో విధులు నిర్వహించే అధికారులు, లాయర్లకి రక్షణ కల్పించారు. కోర్టు ఆవరణ చుట్టు మీడియా ప్రతినిధులు కూడా భారీగా రావడంతో ట్రంప్ విచారణ అయ్యాక వెనుక గేట్ నుంచి ఆయనను బయటకు తరలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రాసిక్యూటర్ కన్రోయ్ మాట్లాడుతూ, న్యాయస్తానం ట్రంప్ చేసిన నేరపూరిత పనులతో పాటు ప్రస్తుతం ఆయన న్యాయస్థానాన్ని న్యాయవాదులను దూషించడం కూడా తప్పు అని తీవ్రంగా ఖండిస్తూన్నామని తెలిపారు. ట్రంప్ తరుపున వచ్చిన న్యాయవాది టోడ్ బ్లెంచ్ తన క్లయింట్ చాలా అప్సెట్ అయి ఆ విధంగా మాట్లాడుతున్నాడని వివరణ ఇచ్చారు. జడ్డి ఇరువైపులవారిని ఉద్దేశించి ఉద్రేకపడకుండా ఎలాంటి అవాంచనీయ పరిస్థితులు కల్పించవద్దని హెచ్చరించారు.
విచారణ తరువాత ట్రమ్ప్ ఏమంటున్నారు?
4 ఏప్రిల్ సాయత్రం తన కిష్టమైన మార్ ఏ లాగో నుంచి ట్రంప్ దెస ప్రజలనుద్దేశించి మీడియా తో మాట్లాడుతూ ‘తాను అమెరికన్ అని, అమెరికన్ గానే గర్వ పడతానని చెప్పారు. ‘నేను చేసిన తప్పు ఏమిటంటే దేశాన్ని నాశనం చేద్దామనుకొనే వారి నుండి దేశానికి రక్షణ కల్పించే విధానాలను సమర్ధించటమే’ అని చెపుతూ తనను ఇరికించిన నేరారోపణ నుంచి రష్యా దేశం నుంచి కూడా తన విరోధులు తనను నేరస్తుడిగా చెయ్యాలను కొనేవారు వున్నారు వరకు అనేక విషయాలు కలిపి మాట్లాడారు. డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ లేటైటియా జేమ్స్ మీద తనకు నమ్మకం లేదు అన్నారు. ఎన్నిక ముందు చేసే ప్రసంగం లాగా సాగిన ఈ మీటింగ్ లో దిగజారిన ఆర్ధిక వ్యవస్థ, ఆఫ్గనిస్తాన్ ఉపసంహరణ లాంటి అనేక విషయాలు గురించి మాట్లాడుతూ తనని మల్లి దేశానికి అధ్యక్షుడు గాచెయ్యాలని కోరారు. ట్రంప్ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం త్వరలో రాబోయే అదనపు ప్రాసిక్యూషన్ల కోసం తన కు మద్దతు ఇచ్చే విశ్వాసులను ప్రోత్సహించడం అని విశ్లేషకుల అభిప్రాయం.
సుబ్బా రావు చెన్నూరి






