రక్షణశాఖ మంత్రికి ట్రంప్ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ రక్షణశాఖ మంత్రి పదవి నుంచి మార్క్ ఎస్సర్ను తొలగించారు. తాజా ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం అందరినీ విస్మయ పరిచింది. అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైన వారు తమ కేబినెట్ సభ్యులను మార్చటం సాధారణంగా జరుగుతుంది. జాతీయ భద్రత దృష్ట్యా ఓడిపోయిన అధ్యక్షులు రక్షణశాఖ జోలికి వెళ్లరు. అయితే దీనికి విరుద్ధంగా ప్రస్తుత రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్సర్ను ఆ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో ఉగ్రవాద నిరోధక జాతీయ కేంద్రం డైరెక్టర్ క్రిస్టాఫర్ మిలర్ను నియమించారు. ఎస్పర్పై వేటు విషయాన్ని ట్రంప్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. కొన్ని నెలల క్రితం దేశంలో ఆందోళనకారులను అణచి వేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాలని ట్రంప్ యోచించగా రక్షణ మంత్రిగా ఉన్న ఎస్పర్ తిరస్కరించారని సమాచారం.






