డొనాల్డ్ ట్రంప్ చివరి ప్రయత్నం .. గెలుపు ఆశల్లేని రాష్ట్రాల్లో
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం చిట్టచివరి అంకంలో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ న్యూమెక్సికో, వర్జీనియా రాష్ట్రాల పర్యటనకు వెళ్లడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. దశాబ్దాల కాలంగా ఈ రెండు రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు విజయం దక్కలేదు. న్యూమెక్సికోలోని ఆల్బకకీలో గురువారం ప్రచారం నిర్వహించిన ట్రంప్ శనివారం వర్జీనియా వెళ్లనున్నారు. పోలింగ్‌కు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నందున హోరాహోరీ పోరు నెలకొని ఉన్న, అత్యంత కీలకమైన ఏడు రాష్ట్రాల ( అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్)పై దృష్టి సారించకుండా గెలుపుపై ఆశల్లేని న్యూమెక్సికో, వర్జీనియాలను ట్రంప్ ఎంచుకోవడం వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవకాశం లేని చోట కూడా సానుకూల పరిస్థితులను సృష్టించగల ప్రతిభ ట్రంప్ సొంతమంటూ ఆయన మద్దతుదారులు సమర్థిస్తున్నారు. అయితే, ట్రంప్ వ్యూహం ప్రమాదకరమని ఇతరులు హెచ్చరిస్తున్నారు.






