Donald Trump: ట్రంప్ నెలరోజుల పాలన

ట్రంప్(Trump) పాలనపై అమెరికా ఎన్నో ఆశలు పెట్టుకుంది. అమెరికా(America) గ్రేట్, ఫస్ట్ అమెరికా నినాదాలు.. దేశ ప్రజలను ఆకట్టుకున్నాయి. అమెరికన్లుగా తలెత్తుకునే విధంగా పాలిస్తానని ట్రంప్ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో అమెరికన్లు సైతం హై..హై… నాయకా అంటూ భారీగా ఓట్లను వేసి గెలిపించారు. మరి ట్రంప్ తొలి అడుగులు ఎలా పడ్డాయి. అతని అడుగులు దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నాయి. అనుకూలురు చెబుతున్నట్లుగా.. అమెరికాను అత్యున్నతస్థాయికి చేరుస్తున్నాయా..? విమర్శల ఆందోళనలను నిజం చేస్తూ పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తున్నాయా..?మిత్రదేశాలను సైతం దూరం చేస్తున్నాయా..? అన్న విషయాలతో తెలుగు టైమ్స్ విశ్లేషణాత్మక కథనాన్ని ఇక్కడ అందిస్తోంది.
జనవరి 20న అట్టహాసంగా ప్రమాణస్వీకారం
జనవరి 20న 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు డొనాల్డ్ ట్రంప్. అక్కడే 55 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు. అందులో క్యాపిటల్ హిల్స్ పై దాడి ఘటన నిందితులకు క్షమాభిక్ష ఘటన కూడా ఉంది. దీంతో పాటు అక్రమ వలసదారుల డిపోర్టేషన్, సరిహద్దు భద్రత, కెనడా, మెక్సికో లాంటి దేశాలపై పన్నులు సహా చాలా అంశాలున్నాయి. అమెరికా గ్రేట్, ఫస్ట్ అమెరికా లాంటి నినాదాలను నిజం చేసేదిశగా అడుగులేస్తున్నారు ట్రంప్.
పాలనలో ట్రంప్ దూకుడు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0.. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్.. దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. అన్ని విషయాల్లోనూ అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తు న్నారు. మిత్రులు, శత్రువులు తేడా లేదు.. అన్నింటా వ్యాపార ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఒప్పుకుంటే సరే.. లేదంటే బలప్రయోగానికి సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈపరిణామాలు ట్రంప్ వ్యవహార శైలిపై.. మిత్రదేశాల్లో కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్లు అమెరికా ఉందిలే ఏదేమైనా చూసుకుంటుం దని నిశ్చింతతో ఉన్న నాటో సభ్య దేశాలు సైతం.. ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం.
కెనడా, మెక్సికోలపై టారిఫ్ వార్..
అక్రమ వలసలు, చొరబాట్లు, ఫెంటమిన్ మాదకద్రవ్యం తదితర కారణాలతో కెనడా, మెక్సికోలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ట్రంప్. అంతేకాదు.. ఎన్నికలకు ముందే మాదేశంలో కలిసిపోండంటూ.. ఓగవర్నర్ గా ఉండమంటూ సెటైర్ వేశారు జస్టిన్ ట్రూడో. 51వ రాష్ట్రంగా ఉండాలని సూచించారు. అంతేకాదు..కెనడా, మెక్సికోలకు మేమెందుకు ఉదారంగా సాయం చేయాలని ప్రశ్నించారు.అవసరంగా ఆర్థికభారం మోస్తున్నామని నిందించారు కూడా ట్రంప్. అంతేకాదు.. మెక్సికో, కెనడా దిగుమతులపై 25 శాతం పన్ను వేస్తామని హెచ్చరించారు. అన్నట్లుగానే టారిఫ్ ప్రకటించారు కూడా.
ట్రంప్ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న చైనా
చైనాపై ఆంక్షలు వేస్తామని ట్రంప్ ప్రకటించడంతో.. రెండు అతిపెద్ద దేశాల మధ్య ట్రేడ్ వార్ తీవ్ర రూపుదాల్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్యాక్సుల ప్రకటనపై చైనా ఎదురుదాడికి దిగింది. అసలే డ్రాగన్ దూకుడుగా ఉంటుంది. మరి చైనా పన్నులేస్తే ఊరుకుంటుందా.. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ తో దాడి చేసింది. డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధం ప్రారంభించిన కొన్ని రోజుల అనంతరం ప్రతి చర్యగా అనేక రకాల అమెరికన్ వస్తువులపై చైనా ప్రతిగా 10 నుంచి 15 శాతం సుంకాలను విధించింది. చైనా చర్య ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు, ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తులపై 15 శాతం , క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు , పెద్ద కార్లు, పికప్ ట్రక్స్, ఇతర ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించనున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ఏకపక్షంగా సుంకాలను పెంచడం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇది అమెరికా సమస్యలను పరిష్కరించడంలో సహాయపడకపోవడమే కాకుండా.. చైనా, అమెరికాల మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారాన్నికూడా దెబ్బతీస్తుందని ప్రకటనలో తెలిపింది. దీన్ని ప్రపంచవాణిజ్య సంస్థలో సవాల్ చేస్తామని ప్రకటించింది.
గల్ఫ్ ఆఫ్ మెక్సికోి కాదు.. గల్ఫ్ ఆఫ్ అమెరికా…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అనుకున్నది సాధించారు. మిత్రదేశాలను బెదిరించి, భయపెట్టి… తాను అనుకున్నదానికి అంగీకరించేలా చేశారు. పనామా కెనాల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం నెగ్గించుకొన్నారు. పనామా కెనాల్‌లో ప్రయాణించే సమయంలో తమ నౌకలకు ఛార్జీలు విధించరని అగ్రరాజ్యవర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. ‘‘అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు. దీంతో మిలియన్ల డాలర్లు ఆదాకానున్నాయి’’ అని ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొంది. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది. ఈవిషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు.
మరోవైపు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌తో ఫోన్‌లో చర్చించారు. తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరిస్తుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సె వెల్లడిరచారు. దీంతో అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని మెచ్చుకొన్నారు. అంతేకాదు..ఇప్పటివరకు ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గూగుల్ మ్యాప్ ఇక నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చింది.
అమెరికా నుంచి పెద్దఎత్తున డిపోర్టేషన్..
ముందుగా చెప్పినట్లుగానే అమెరికా నుంచి అక్రమ వలసదారులను పెద్దఎత్తున డిపోర్టేషన్ చేస్తున్నారు ట్రంప్. ఏకంగా సైనిక విమానాలతో వారి స్వదేశాలకు పంపిస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వారితో అమెరికా సైన్యం అత్యంత అమానవీయంగా తరలిస్తోంది. కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి మరీ పంపిస్తోంది. ఈ పరిణామంపై మిత్రదేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. తన అర్థబలం, అంగబలం చూపిస్తూ.. వారినోరు మూయిస్తోంది. లేటెస్టుగా 205 మంది భారతీయులను.. స్వదేశానికి పంపించింది అమెరికా.
చితికిపోయిన డాలర్ డ్రీమ్స్
ఈ ఘటనలో చాలా బాధాకరమైనది ఏమిటంటే… లక్షలకు లక్షలు అప్పు చేసి, డంకీ రూట్ ద్వారా అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు.. డాలర్ డ్రీమ్స్ ను చిదిమేశాయి. బయటకు వస్తే అరెస్టులు తప్పవు. ఇన్నాళ్లు ఏదో చిన్న,పెద్ద పని చేసి నాలుగు డాలర్లు సంపాదించుకున్న వీరందరూ.. ఇప్పుడు బతుకు భయంతో అల్లాడుతున్నారు. ఇప్పటికే 205 మందిని వెనక్కుపంపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు 18 వేల మంది వెనక్కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దారుణంగా మోసపోయాం… అప్పు తీర్చేదెలా..? వడ్డీ కట్టేదెలా..?
తొలి బ్యాచ్ లో వెనక్కు వచ్చిన కొందరు భారతీయ బాధితులు.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. లక్షలకు లక్షలు అప్పులు చేసి, భూములుతాకట్టు పెట్టి, ఉన్నదంతా అమ్మేసి అమెరికాలో అడుగు పెట్టిన వీరందరూ.. ఇప్పుడు ట్రంప్ పుణ్యమాని నయా పైసా చేజిక్కించుకోకుండా బతుకుజీవుడా అని వెనుదిరిగారు. ఇంటికి అయితే చేరుకున్నారు. మరి వీరు చేసిన అప్పు ఎవరు తీరుస్తారు..? ఇప్పుడిదే ఆయా కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోంది.ఉన్న ఊళ్లో పరువు పోగొట్టుకుని ఎలా బతకాలి.. చేసిన అప్పులు తీర్చాలి. ఇంట్లో బాధ్యతలు నెరవేర్చాలి. వీటన్నింటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సదరు బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి.
ఇంటికి వచ్చేయండి బిడ్డా.. విద్యార్థులకు తల్లితండ్రుల ఫోన్ కాల్స్
అమెరికా వెళ్లి పై చదువులు చదివి అక్కడే స్థిరపడాలనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడా కల పీడకలగా మారిపోయింది. వలసదారులకూ పార్ట్ టైం జాబ్ విషయంలో కొత్త నిబంధనలు విధించారు. ఈ చర్యలతో భారతీయ విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం మానేస్తున్నారు. ఇంటికి ఫోన్లు చేసి డబ్బు పంపించాలని కోరుతున్నారు. ఈ పరిణామం ఆయా కుటుంబాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పుడేం చేయాలో తోచడం లేదు. ఇక్కడికే వచ్చేయండి.. ఏదైనా చూసుకుందాం అని తమ పిల్లలకు చెప్పామని ఓ తండ్రి చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.
పెరిగిన వీసా నిరాకరణ.. తగ్గిన వీసాల సంఖ్య
గత ఏడాది కాలంగా అమెరికా భారతీయ విద్యార్థులకు జారీ చేసే F-1 విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది. యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ డేటా విశ్లేషణ ప్రకారం, జనవరి నుంచి సెప్టెంబర్ 2024 వరకు 64,008 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేశారు. 2023లో అయితే ఇదే వ్యవధిలో 1,03,495 వీసాలు జారీ చేశారు. మొత్తంగా భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల్లో 38 శాతం తగ్గుదల కనిపించింది. అమెరికాలో జాబ్ మార్కెట్ తగ్గిపోవడం కూడా ఒక ప్రధాన కారణం. యూఎస్ కంపెనీలు ప్రస్తుతం స్థానిక ప్రజలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విదేశీ విద్యార్థులను పక్కన పెడుతోంది. ఈ పరిస్థితులపై అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగం దొరకడం కష్టమైందని, పరిస్థితులు చాలా దారుణంగా మారాయని ఆవేదన చెందుతున్నారు.
పని ప్రదేశాల్లో నిఘా..
అమెరికాలో ప్రస్తుతం అన్ని కార్యాలయాలు, పని ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థలు వలసదారులను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. గుర్తింపు కార్డులు, చెల్లుబాటు అయ్యే పత్రాలను ప్రతి చోటా పరిశీలిస్తూనే ఉండటం భారతీయ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. చదువులు, ఖర్చులకు అవసరమయ్యే డబ్బు సమకూర్చుకోవడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులకు కఠిన విధానాలు అడ్డుగా మారాయి. దర్యాప్తు సంస్థల కఠినమైన వైఖరి కారణంగా వారు తమ ఉద్యోగాలను వదిలివేస్తున్నారు..
డిపోర్టేషన్ విజయవంతం కాదు- పోప్
అమెరికా భారీ బహిష్కరణ కార్యక్రమంపై తాజాగా పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. అక్రమంగా ఉన్నారనే కారణంతో వారిని బలవంతంగా పంపించి వేయడమనేది వారి గౌరవాన్ని తగ్గించినట్లే అవుతుందన్నారు. అమెరికా బిషప్‌లకు లేఖ రాసిన పోప్ వలసదారుల అణచివేతకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాదని పేర్కొన్నారు. నేరస్థుల నుంచి తమ ప్రజలను రక్షించుకునే హక్కు ఆయా దేశాలకు ఉందని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అయితే, తీవ్ర పేదరికం, హింస, అభద్రత, దాడులు, వాతావరణ విపత్తుల కారణంగా సరిహద్దులు దాటి వచ్చే వారిని మాత్రం స్వాగతించాలని, వారికి రక్షణ కల్పించాలన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ దాడులపై ట్రంప్ విధానం
అందరూ అనుకున్నట్లుగానే ట్రంప్.. ఇజ్రాయెల్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. దాడులు చేయడం ఇజ్రాయెల్ హక్కంటున్న ట్రంప్.. ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేసి తీరాలని హమాస్ ను హెచ్చరించారు.
గాజాను స్వాధీనం చేసుకునేలా ట్రంప్ ప్లాన్
గాజా ప్రాంతాన్ని స్వాధినం చేసుకోవాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. స్ట్రిప్‌ను అభివృద్ధి చేసి, దానిని ‘రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్’గా మార్చాలనుకుంటున్నట్లు కూడా ఆయన అన్నారు. అంతేకాదు..పాలస్తీనియన్లను శాశ్వతంగా ఈజిప్ట్, జోర్డాన్‌లకు ‘తరలించాలి’ అని ఆయన గతంలో సూచించారు.ఆ వెంటనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సహా ప్రపంచ దేశాల నాయకులు ట్రంప్ ప్రతిపాదనలను ఖండిరచారు. మరోవైపు గాజా అమ్మకానికి లేదంటూ ఆ ప్రాంతానికి చెందిన నేతలు స్పష్టం చేశారు. అంతేగాక గాజా శరణార్థులను తమ దేశంలోకి రానీయకుండా జోర్డాన్, ఈజిప్ట్ అడ్డుకుంటే అమెరికా నుంచి వారికి అందుతున్న సాయాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా గాజాకు పాలస్తీనియన్ల తిరిగి రాకను అంగీకరించబోమని స్పష్టంచేశారు. కాగా గాజాలో దాదాపు 15 నెలల పాటు యుద్ధం కొనసాగిన అనంతరం జనవరి 19 నుంచి హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ విధానం
అధికారంలోకి వస్తే యుద్ధాన్ని ఆపేస్తానంటూ గతంలో ఘనంగా ప్రకటించిన ట్రంప్ నకు.. ఇది అంత సులభం కాదన్న సంగతి అర్థమైంది. ఇటు పుతిన్.. యుద్ధం విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. కీవ్ తన ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే, యుద్ధం ఆగుతుందని తెలిపారు. అయితే ఒప్పందానికి రాకుంటే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించినా.. క్రెమ్లిన్ వెనక్కు తగ్గిన పరిస్థితులు కనిపించడం లేదు.
మరోవైపు.. ఉక్రెయిన్ కు ఆయుధసాయం కొనసాగిస్తోంది అమెరికా. ఈపరిస్థితుల్లో ఉక్రెయిన్ ను వదిలేస్తే.. అంతర్జాతీయంగా అమెరికా పరువు గంగలో కలుస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సమకూరుస్తోంది.ఈ సందర్భంగా ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘వారు (రష్యా- ఉక్రెయిన్‌లను ఉద్దేశిస్తూ) ఒప్పందం చేసుకోవచ్చు.. చేసుకోక పోవచ్చు. ఉక్రెయిన్‌లు రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా ఉక్రెయిన్‌తో 500 మిలియన్ డాలర్ల డీల్‌తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో కీవ్‌కు పంపనున్నట్లు ట్రంప్ వెల్లడిరచారు.
దాదాపు మూడేళ్లుగా ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. అయినా ఎక్కడా ముగింపుఛాయలు కనిపించడం లేదు. ఈక్రమంలో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. తాను యుద్ధాన్ని ఆపేస్తానని పలుమార్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
అదానీకి అమెరికా ఊరట.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు
భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టుల వ్యవహారంలో అదానీ గ్రూప్‌పై విచారణ కోసం ఉద్దేశించిన ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం (ఎఫ్‌సీపీఏ) నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడి న్యాయ శాఖను ఆదేశించారు. ఈ మేరకు 50 ఏళ్ల నాటి చట్టం నిలుపుదల చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో అదానీ గ్రూప్‌నకు తాత్కాలికంగా ఊరట లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అదానీ గ్రూప్ లంచాలు ఇవ్వజూపినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిధుల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు ఉండడంతో ఇదే చట్టం కింద జో బైడెన్ సర్కారు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవల అధికారం చేపట్టిన ట్రంప్.. ఎఫ్‌సీపీఏ అమలును నిలిపివేయాలని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బొండిని ట్రంప్ ఆదేశించారు. ఎఫ్‌సీపీఏ చట్టం మార్గదర్శకాలు, విధివిధానాలను 180 రోజుల్లోగా సమీక్షించాలని అటార్నీ జనరల్‌కు సూచించారు.
ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో ఈ ఆరు నెలల్లో కొత్తగా ఈ చట్టం కింద ఎలాంటి దర్యాప్తులూ చేపట్టకూడదు. అయితే, ఆరు నెలలో రివ్యూ పీరియడ్ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాన్ని బట్టి అదానీ అంశం ఆధారపడి ఉంటుంది.
ఆర్థిక సాయం కట్..
ఎయిడ్స్ వ్యాధి నివారణకు ఏటా అమెరికా ఇచ్చే రూ. 3,83,160 కోట్ల సాయాన్ని నిలిపివేస్తూ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాక ఈ సంస్థలోని స్టాఫ్ ను 10,000 నుంచి 300లకు తగ్గించింది ట్రంప్ సర్కార్.ప్రపంచ దేశాల్లోని ఎయిడ్స్ రోగులకు తమ వంతు సాయం కింద ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఫ్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్ అనే విధానాన్ని అప్పటి అధ్యక్షుడు జార్జి.వీ. బుష్ ప్రారంభించారు.
400శాతం మరణాలు..
మరోవైపు అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులపై భారం తప్పదని తెలిపింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మెడిసిన్ కొనే స్తోమత లేక 2029 కల్లా 63 లక్షల ఎయిడ్స్ రోగులు మృతి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మరణాల సంఖ్య 400 శాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2023లో కేవలం 13 లక్షల కేసులు మాత్రమే నమోదు కాగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో 160 దేశాల్లో వచ్చిన సత్ఫలితాలు వృథా అవుతాయని పేర్కొంది.
ట్రంప్ ఎఫెక్ట్ మార్కెట్లు ఖల్లాస్..
ట్రంప్ నిర్ణయాలు వివిధ దేశాల వ్యాపార వర్గాల్లోనూ ఆందోళనను రగిలించాయి. ఇలా భారతీయ స్టాక్ మార్కెట్స్ పై కూడా ట్రంప్ ప్రభావం పడిరది. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రంప్ సృష్టించిన భయాల కారణంగా భారత స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. దేశంలోని ప్రముఖ కంపనీల షేర్లన్ని నష్టాలబాట పట్టడంతో కేవలం ఒక్కరోజులో దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇలా ట్రంప్ దెబ్బకు భారతీయ స్టాక్ మార్కెట్స్ విలవిల్లాడిపోతున్నాయి. కొద్దిరోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. కానీ ఈ స్థాయిలో పతనం అవుతాయని ఎవరూ ఊహించలేదు. ఏకంగా లక్షల కోట్లు ఆవిరయిపోయి స్టాక్ మార్కెట్ కుదేలయిపోయింది.
పేపర్ వద్దు.. ప్లాస్టిక్ ముద్దంటున్న ట్రంప్
ప్రపంచ దేశాలన్నీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తుంటే.. ట్రంప్ మాత్రం వాటినే వాడదామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బైడెన్ సర్కారు అమల్లోకి తీసుకు వచ్చిన పేపర్ స్ట్రాలను నిషేధించి.. మళ్లీ ప్లాస్టిక్ స్ట్రాలనే వాడదామంటూ కొత్త రూల్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ స్ట్రాల ప్లేస్‌లో కాగితం వాడాలనే బైడెన్ పరిపాలన విధానాన్ని రద్దు చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకాలు చేశారు. 2027 నాటికి ఆహార సేవా కార్యకలాపాలు, ఈవెంట్లు, ప్యాకేజింగ్ నుంటి స్ట్రాలు సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల సమాఖ్య కొనుగోళ్లను దశలవారీగా నిలిపివేయాలంటూ బైడెన్ పరిపాలనా విధానం ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ వీటిని ట్రంప్ సర్కారు వెనక్కి తీసుకుంటూ.. దేశ వ్యాప్తంగా పేపర్ స్ట్రాలను వాడటాన్ని తగ్గించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 45 రోజుల్లోగా పేపర్ స్ట్రాల వాడకాన్ని ముగించడానికి దేశవ్యాప్తంగా ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని కొత్త ఉత్తర్వులు చెబుతున్నాయి. ముఖ్యంగా వైట్ హౌస్ వద్ద ఆర్డర్‌పై సంతకం చేస్తూ.. ఇది హాస్యాస్పదమైన పరిస్థితి అని, మళ్లీ తిరిగి మనం ప్లాస్టిక్ స్ట్రాల కోసం వెళ్తున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుపైనా ఆంక్షలు
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించారు. అమెరికా, సన్నిహిత మిద్రదేశాలను టార్గెట్ గా చేసుకుంటోందని ట్రంప్ ఆరోపించారు.ట్రంప్ నిర్ణయంతో అమెరికా, దాని మిత్రదేశాలకు చెందిన పౌరులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తులో సహకరించేవారికి, వారి కుటుంబాలకు ఆర్థిక, వీసా పరిమితులు ఏర్పడతాయి.ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ట్రంప్ ఈ సంతకం చేశారు.
ట్రంప్ ఆంక్షలపై ఈయూ ఫైర్..
అమెరికా టారిఫ్ వార్ పై యూరోపియన్ యూనియన్ (EU) మండిపడుతోంది. ముఖ్యంగా అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే 27దేశాల యూరప్ కూటమి ఘాటుగా స్పందించింది. అర్ధరహిత టారిఫ్‌లతో దుందుడుకుగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వానికి తగు సమాధానం చెప్తామని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులావాన్ డీర్ లియాన్ ప్రకటించారు. ట్రంప్ సర్కార్ విధిస్తున్న టారిఫ్…వ్యాపారస్తులకు చేటు తెస్తాయన్నారు.ఇక ప్రజలకు… గుదిబండలుగా మారనున్నాయన్నారు.. యూరోపియన్ యూనియన్‌కు భారంగా మారిన ఈ టారిఫ్‌లకు దీటైన సమాధానం చెప్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈయూ కూటమిలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జర్మనీ సైతం అమెరికా స్టీల్, అల్యూమినియంలపై టారిఫ్‌లు పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్(olaf scholz) స్పందించారు. అమెరికా మాకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే యురోపియన్ యూనియన్ మొత్తం ఏకతాటిమీదకొచ్చి ఐక్యంగా నిలబడుతుంది. అప్పుడు అంతిమంగా ఆర్థికయుద్ధం మొదలై ఇరువైపులా దాని విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఒలాఫ్ వ్యాఖ్యానించారు.