అధికార మార్పిడి ఆట కాదు
అమెరికాలో అధికార మార్పిడి ప్రతిష్టంభనపై ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రతిష్టను దిగజార్చే చర్యగా ఉందంటూ మండిపడుతున్నారు. తాజాగా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా ఇదేవిధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పదని వ్యాఖ్యానించారు. అధికార మార్పిడి ఆట కాదంటూ పరోక్షంగా ట్రంప్‌నకు చురకలు వేశారు. ఈ సందర్భంగా గత అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు. డెమొక్రాట్లను ఓడించి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చాలా బాధ పడ్డాను. కానీ, అప్పట్లో అమెరికన్ ఓటర్లు ట్రంప్‌నకు పట్టం గట్టారు. ఓటమిని అంగీకరించి, అధికార మార్పిడికి సహకరించాం. అంతకుముందు జార్జిబుష్, లారా శ్వేతసౌధాన్ని వీడినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇప్పుడు అలాగే చేయాలని సిబ్బందికి చెప్పాం. ప్రశాంత వాతావరణంలో అధికార మార్పిడి జరగడం అమెరికా ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందన్నారు.






