మరో సంచలనం.. అమెరికా రక్షణమంత్రికి
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇటీవల తాను ఆసుపత్రిలో చేరిన విషయంపై అధ్యక్షుడు జో బైడెన్‌కు, వైట్‌హౌస్‌కు 5 రోజుల పాటు సమాచారం ఇవ్వకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే, మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత నెల ఆరంభంలో ఆస్టిన్ ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడినట్లు తేలిందని, ఆయనకు సర్జరీ కూడా జరిగిందని రక్షణశాఖ కార్యలయం పెంటగాన్ వెల్లడించింది. ఈ విషయంపై బైడన్‌కు మంగళవారం వరకూ సమాచారం ఇవ్వలేదని అంగీకరించింది.
గత నెల 22న ఆస్టిన్‌కు సర్జరీ నిర్వహించారని, మరుసటి రోజే ఆయన డిశ్ఛార్జి అయ్యారని తెలిపింది. ఆ తర్వాత జనవరి 1న మళ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించింది. కొన్ని రోజులపాటు రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి కాథ్లీన్ హిక్స్ వద్ద కూడా ఆస్టిన్ అనారోగ్యంపై గోప్యత పాటించడం, రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంపై సమీక్ష జరపాలని రక్షణ విభాగం ఆదేశించింది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తప్పకుండా అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని అందరు మంత్రులకు వైట్‌హౌస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.






