Obama :ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారా ?

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మిచెల్ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. బరాక్ ఒబామా (Barrack Obama), ఆయన భార్య మిచెల్ ఒబామా (Michelle Obama) త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఒబామా హాజరుకానుండగా ఆయన సతీమణి, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా దూరంగా ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఒబామా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, అందువల్లే ఈ కార్యక్రమానికి మిచెల్ హాజరు కావడంలేదని ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిచెల్ హాజరుకాకపోవడంతో ఒబామా దంపతులకు విడాకులు ఖాయమైనట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. 1992లో వివాహ బంధంతో ఒక్కటైన ఒబామా దంపతులకు సాషా, మలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2009లో బరాక్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.