రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం.. ఫెడరల్ రిజర్వ్ కమిటీలో చోటు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) తన ఆర్థిక విధానాలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ కీలక సంస్కరణల ప్రక్రియలో, భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఫెడ్ కమిటీలో చోటు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్యాలెన్స్ షీట్ పరిశీలనపై కమిటీ..
ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ చేపట్టిన ఈ సంస్కరణల్లో భాగంగా, ఫెడరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్‌ను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను సభ్యునిగా నియమించారు. ద్రవ్య విధానాల రూపకల్పనలో కొత్త ఆలోచనలను, భిన్నమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కెవిన్ వార్ష్ వెల్లడించారు.
సెనెట్ నుంచి ప్రశంసలు..
గత ఐదేళ్లుగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించి కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను పునఃసమీక్షించడం అవసరమని కెవిన్ వార్ష్ పేర్కొన్నారు. ఈ నియామకాన్ని సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ఛైర్మన్ టిమ్ స్కాట్ స్వాగతించారు. జెరెమీ స్టెయిన్‌తో పాటు రఘురామ్ రాజన్ వంటి విభిన్న దృక్పథాలు కలిగిన నిపుణులను ఒకే కమిటీలో చేర్చడం సముచిత నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆర్థిక అంశాలపై సమగ్ర చర్చకు దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నివేదికలు ..
వివిధ కమిటీల కోసం తాను విశ్వసించే 15 మంది నిపుణులను ఎంపిక చేసినట్లు కెవిన్ వార్ష్ తెలిపారు. ఈ కమిటీలకు ఆరు నెలల గడువును నిర్దేశించగా, సెప్టెంబర్ నాటికి తొలి నివేదికలు, ఈ సంవత్సరం చివరలో తుది సిఫార్సులు అందే అవకాశం ఉంది. అయితే, ఇవి కేవలం సలహా కమిటీలు మాత్రమేనని, తుది ద్రవ్య విధాన నిర్ణయాలను మాత్రం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) మాత్రమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. 2013-2016 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ ఇప్పుడు అమెరికా ఆర్థిక విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్నారు.








