Jasprit Bumrah: బుమ్రా సూపర్.. కానీ ఆ తర్వాత ఎవరు?
క్రికెట్ అనేది సమిష్టి క్రీడ. పదకొండు మంది ఆటగాళ్లు రాణిస్తేనే విజయాలు వరిస్తాయి. కానీ, చరిత్రలో అరుదుగా ఒక ఆటగాడు మొత్తం జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకుని, ఒంటిచేత్తో విజయాలు అందిస్తుంటాడు. ప్రస్తుత భారత జట్టులో ఆ ‘బ్రహ్మాస్త్రం‘ పేరు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లలో టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో అతడి పాత్ర అసాధారణం. అయితే బుమ్రా గొప్పదనం ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. అతడిపై జట్టు అతిగా ఆధారపడటం, ‘బుమ్రా తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడం భారత క్రికెట్ భవిష్యత్తును అంతే ఆందోళనలో పడేస్తోంది.
వెంటాడుతున్న పనిభారం..
2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నా.. 2026 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్స్‌లో తన మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేసినా అది బుమ్రాకే (Jasprit Bumrah) చెల్లింది. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజమే అతన్ని ‘శతాబ్దానికి ఒక్కడు’ అని కీర్తించారంటే అతని బౌలింగ్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చేదు నిజం దాగుంది. బుమ్రా వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. అతడి ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా ఎప్పుడూ ఫిట్నెస్ ముప్పు పొంచి ఉంటుంది.
గత కొన్నేళ్లుగా అతడి ‘వర్క్‌లోడ్ మేనేజ్మెంట్’ (పనిభారం) కోసం బీసీసీఐ ఒక ప్రత్యేక వ్యవస్థనే నడుపుతోంది. 2024 నుంచి 2026 మధ్య ఈ 20 నెలల వ్యవధిలో బుమ్రా (Jasprit Bumrah) కేవలం ఒకే ఒక్క వన్డే ఆడాడు. టీ20 ప్రపంచకప్‌ల కోసం వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీలకు విశ్రాంతి తీసుకున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ నాటికి బుమ్రా వయసు 34 ఏళ్లకు చేరుకుంటుంది. ఫాస్ట్ బౌలర్లకు ఆ వయసు తర్వాత అంతర్జాతీయ స్థాయిలో, అదే కచ్చితత్వంతో కొనసాగడం చాలా కష్టం. ఒకవేళ ఏ చిన్న గాయమైనా, అతడు మెగా టోర్నీలకు దూరమైతే భారత జట్టు బౌలింగ్ లైనప్ పదును తగ్గడం ఖాయం.
ఇవి కూడా చదవండి
నాణ్యమైన ప్రత్యామ్నాయం ఏది?
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. మౌలిక వసతులకు, డబ్బుకు ఏమాత్రం కొదవలేదు. దేశవాళీ నుంచి అద్భుతమైన బ్యాటర్లు పుట్టుకొస్తున్నారు కానీ, ప్రపంచ స్థాయిని శాసించే ఫాస్ట్ బౌలర్లు మాత్రం తయారు కావడం లేదు. మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్లు జట్టుకు దూరమయ్యాక పరిమిత ఓవర్లలో బుమ్రాకు (Jasprit Bumrah) అండగా నిలిచే సరైన జోడీ కరువైంది.
ప్రస్తుతం ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా లాంటి బౌలర్లు వికెట్లు తీస్తున్నా.. కీలక సమయాల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, తుషార్ దేశ్‌పాండే లాంటి వారిని పరీక్షించినా అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన ఫలితం దక్కలేదు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కనుమరుగవుతున్న యువకెరటాలు..
ఐపీఎల్లో 150 కి.మీకి పైగా వేగంతో బంతులు విసిరిన ఉమ్రాన్ మాలిక్ అంచనాలు అందుకోలేక ఉన్నట్లుండి కనుమరుగయ్యాడు. లక్నో స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ రాకతోనే మెరిసినా, వెంటనే గాయాల బారిన పడి అయోమయంలో ఉన్నాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆకిబ్ నబీ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. రంజీల్లో సత్తా చాటిన ఇతడిని ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇలా ఎప్పుడో ఒకరు రావడం, కనుమరుగవడం కాకుండా.. ఆస్ట్రేలియా తరహాలో పటిష్టమైన ‘పేస్ బౌలింగ్ పూల్’ను తయారు చేయడంపై బీసీసీఐ తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవి కూడా చదవండి








