‘No UPI Day’ ఏ తేదీన, ఎందుకు పాటించాలి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు ఎన్నో డేలు చూసి ఉంటారు. పాటించి ఉంటారు. కానీ ‘No UPI Day’ అనేది ఒకటి మన జీవితాల్లోకి రాబోతోందని అసలు ఊహించి ఉండరు. అయితే ఊహించనివన్నీ జరగకూడదు అని రూల్ లేదు కాబట్టి.. ఆ డే కూడా ఫిక్స్ అయిపోయింది.అక్టోబర్ 2న ‘No UPI Day’ పాటించాలని వ్యాపారులు పిలుపునిచ్చారు.
అయితే అసలు ప్రశ్నలు ఇక్కడి నుంచే మొదలవుతున్నాయి. మనం అంతా ఆ రోజు UPI వాడకూడదా? అసలు ఆ రోజు ఏం చేయాలి? వ్యాపారులు ఎందుకు ఈ ‘No UPI Day’ కాన్సెప్టును తీసుకొచ్చారు?
అసలు ‘No UPI Day’ అంటే ఏంటి?
ముందుగా ఒక విషయం క్లారిటీగా తెలుసుకోవాలి. అక్టోబర్ 2న దేశంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా UPI వాడకూడదనే ప్రభుత్వ ఆదేశం ఏమీ లేదు. ఇది వ్యాపార సంఘాలు ఇచ్చిన నిరసన పిలుపు.
ముంబైలో దాదాపు ఆరు లక్షల మంది రిటైలర్లకు ప్రాతినిధ్యం వహించే Federation of Retail Traders Welfare Association (FRTWA) అక్టోబర్ 2న ‘No UPI Day’ పాటించాలని వ్యాపారులను కోరింది. ఆ రోజు దుకాణాల వద్ద నిరసన పోస్టర్లు ఏర్పాటు చేయాలని, వీలైనంత వరకు UPI చెల్లింపులను స్వీకరించకుండా తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చింది.
ఇప్పటికే ఘాజియాబాద్‌లో కొన్ని దుకాణాల ముందు “UPI Payment Will Not Be Accepted” అనే బోర్డులు కనిపిస్తున్నాయి. అంటే.. ఇది వినియోగదారుల కోసం ప్రకటించిన సెలవు రోజు కాదు. వ్యాపారులు తమ అభ్యంతరాన్ని తెలియజేయడానికి ఎంచుకున్న ఒక నిరసన రోజు.
అసలు వ్యాపారులు ఎందుకు కోపంగా ఉన్నారు?
ఇన్నాళ్లూ UPI ద్వారా వ్యాపారులకు జరిగే పేమెంట్లలో MDR అంటే Merchant Discount Rate దాదాపు శూన్యంగానే ఉంది. కానీ అక్టోబర్ 15 నుంచి ₹2,000కు మించిన కొన్ని Merchant UPI లావాదేవీలపై 0.4 శాతం MDR అమల్లోకి రానుంది.
అంటే ఒక కస్టమర్ ₹10,000 విలువైన వస్తువు కొనుగోలు చేసి UPI ద్వారా చెల్లిస్తే, 0.4 శాతం లెక్కన ₹40 వరకు ఛార్జీ ఏర్పడుతుంది. కస్టమర్‌కు మాత్రం QR కోడ్ స్కాన్ చేసి ₹10,000 పంపినట్టే కనిపిస్తుంది. కానీ వ్యాపారి లెక్కలో మాత్రం ఆ పేమెంట్‌కు ఒక చిన్న ఖర్చు చేరుతుంది.
వ్యాపారుల నిరసనకు ఇదే ప్రధాన కారణం.
‘0.4 శాతం’ అంత పెద్ద విషయమా?
కాగితంపై చూస్తే 0.4 శాతం చాలా చిన్న సంఖ్యలా కనిపిస్తుంది. కానీ తక్కువ మార్జిన్‌తో పనిచేసే వ్యాపారులకు అదే సంఖ్య ముఖ్యం అవుతుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ దీనిపైనే ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోల్ బంకుల లాభాల మార్జిన్లు దాదాపు 0.5 శాతం వరకు మాత్రమే ఉంటాయని, అలాంటి పరిస్థితిలో 0.4 శాతం MDR అదనపు భారంగా మారుతుందని వారు చెబుతున్నారు.
అందుకే అక్టోబర్ 16 నుంచి ₹2,000కు మించిన UPI చెల్లింపులను స్వీకరించబోమని వారు ప్రకటించారు. అదే సమయంలో రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరో సమస్యను ప్రస్తావిస్తోంది.
పండుగల సీజన్.
దసరా, దీపావళి సమయంలో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు పెరుగుతాయి. దీంతో ₹2,000కు మించిన లావాదేవీలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో UPIపై ఛార్జీలు రావడం వల్ల కొందరు వ్యాపారులు మళ్లీ క్యాష్ వైపు వెళ్లే అవకాశం ఉందని RAI చెబుతోంది.
అయితే ప్రతి UPI పేమెంట్‌పై ఛార్జీ పడుతుందా?
₹2,000 లోపు జరిగే UPI వ్యాపార లావాదేవీలపై ఈ కొత్త MDR వర్తించదు. NPCI ప్రకారం, మొత్తం UPI Merchant Transaction Volumeలో 96 శాతానికి పైగా లావాదేవీలు ₹2,000 లోపే ఉంటాయి. అవి ఉచితంగానే కొనసాగుతాయి. అంతేకాదు, నెలకు ₹1 లక్ష వరకు UPI ద్వారా రసీదులు పొందే వ్యాపారులకు MDR నుంచి మినహాయింపు ఉంటుంది.
అంటే మీ దగ్గర ₹10కు టీ, ₹500కు షర్ట్, ₹1,000కు సరుకులు కొని UPI ద్వారా చెల్లిస్తే.. ఈ కొత్త 0.4 శాతం MDR కారణంగా ఒక్కసారిగా అదనపు ఛార్జీ పడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు.
మరి అక్టోబర్ 2న మనం ఏం చేయాలి?
ఇదే అసలు సందేహం. సాధారణ వినియోగదారుడు అక్టోబర్ 2న తప్పనిసరిగా UPI బంద్ చేయాల్సిన అవసరం లేదు. ‘No UPI Day’ అనేది వ్యాపార సంఘాల నిరసన పిలుపు. కాబట్టి ఆ రోజు ఏ దుకాణం UPI తీసుకోకపోతే, అక్కడ క్యాష్ లేదా అందుబాటులో ఉన్న మరో చెల్లింపు మార్గాన్ని ఉపయోగించాల్సి రావచ్చు.
కొన్ని దుకాణాలు మాత్రం సాధారణంగానే UPI తీసుకునే అవకాశం ఉంది. అంటే అక్టోబర్ 2న దేశం మొత్తం UPI ఆగిపోదు. UPI వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది.
మరి ప్రభుత్వం ఏం చెబుతోంది?
వ్యాపారుల ఆందోళనకు ప్రభుత్వం మరో కోణాన్ని చూపిస్తోంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారం MDR అనేది పన్ను కాదు, సెస్ కాదు. పేమెంట్ సేవలను అందించే సంస్థలు వసూలు చేసే ఛార్జీ. NPCI కూడా చిన్న వ్యాపారులపై MDR భారం గురించి వస్తున్న కొన్ని వాదనలు తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంది.
ముఖ్యంగా ₹2,000 లోపు జరిగే లావాదేవీల్లో 96 శాతానికి పైగా ఉండటంతో, UPI వినియోగంలో ఎక్కువ భాగం ఇప్పటికీ ఉచితంగానే ఉంటుంది.
మరి ఈ కొత్త ఫీజుతో ఎవరికీ లాభం?
UPI ద్వారా మనం డబ్బు పంపుతున్నప్పుడు మనకు కనిపించేది QR కోడ్ మాత్రమే. కానీ దాని వెనక పేమెంట్ యాప్స్, బ్యాంకులు, సాంకేతిక మౌలిక వసతులు ఉన్నాయి. కొత్త MDR వల్ల పేమెంట్ యాప్స్‌కు ఒక కొత్త ఆదాయ వనరు ఏర్పడనుంది.
Reuters ప్రకారం, ఆగస్టులో UPI పేమెంట్ విలువలో దాదాపు 80 శాతం PhonePe, Google Pay ద్వారా జరిగింది. Bernstein అంచనా ప్రకారం, కొత్త ఫీజు విధానం 2028 మార్చి నాటికి పేమెంట్ యాప్స్‌కు సంవత్సరానికి $1.1 బిలియన్ వరకు ఆదాయం తెచ్చే అవకాశం ఉంది. అందులో దాదాపు $900 మిలియన్ PhonePe, Google Payలకు వెళ్లవచ్చని అంచనా.
అంటే ఒకవైపు వ్యాపారులు “మా ఖర్చు పెరుగుతోంది” అంటున్నారు. మరోవైపు పేమెంట్ కంపెనీలకు ఇది “కొత్త ఆదాయ మార్గం” అవుతోంది.
UPI ఉచితం అయితే.. దాన్ని నడిపించే ఖర్చును ఎవరు భరించాలి?
వినియోగదారుడు చెల్లించాలా?, వ్యాపారి చెల్లించాలా?, పేమెంట్ కంపెనీలు భరించాలా? లేక ప్రభుత్వం, RBIలాంటి సంస్థలు ఆ ఖర్చును భరించాలా? ఇదే అసలు చర్చ.
అందుకే అక్టోబర్ 2 ‘No UPI Day’ ఒక చిన్న నిరసనగా కనిపించినా, దాని వెనక ఉన్న విషయం మాత్రం చాలా పెద్దది.
ఫైనల్ గా…
మన చేతిలో ఉన్న ఫోన్లో UPI ఎంత సులభంగా కనిపిస్తుందో.. దాని వెనక ఉన్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంత సులభమైనది కాదు. ఇక అక్టోబర్ 2న QR కోడ్ ముందు నిలబడినప్పుడు.. మీరు డబ్బు పంపాలా, క్యాష్ ఇవ్వాలా అన్నది పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చు.








