ఉపరాష్ట్రపతికి అరుదైన గౌరవం
ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఐరాస ఆధ్వర్యంలోని యూనివర్సిటీ ఆఫ్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. చట్టబద్దపాలన, ప్రజాస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి విషయంలో ఆయన చేసిన కృషిని గుర్తించి డాక్టరేట్‌ను ప్రదానం చేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. కోస్టారికా రాజధాని శాన్‌జోస్‌లో యూనివర్సిటీ డీన్ చేతుల మీదుగా వెంకయ్య డాక్టరేట్ అందుకున్నారు. ఈ వర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన ప్రపంచంలోని అతి కొద్దిమంది ప్రముఖులలో వెంకయ్య ఒకరు. ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయుడు కూడా ఆయనే.
తనకు లభించిన డాక్టరేట్ భారత తత్వశాస్త్రం ప్రవచించే వసుదైక కుటుంబ, శాంతి, సామరస్య భావానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన గుర్తింపుగా వెంకయ్య అభివర్ణించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి జరుపుకొంటున్న సంవత్సరంలో ఈ గౌరవాన్ని పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో కోస్టారికా మాజీ అధ్యక్షురాలు లారా చిన్ చిల్లా, అంతర్జాతీయ కోర్టు మాజీ జడ్డి థామస్ బెర్గెంథల్, పనామా మాజీ అధ్యక్షుడు ఆరిస్టిడెస్ రోయో తదితరులు ఉన్నారు.













