ఇద్దరు సీఎంల చర్చలు హర్షనీయం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదర భావంతో చర్చించుకోవడం హర్షించదగ్గ పరిణామమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కలిసి మాట్లాడుకోవటం స్వాగతించాల్సిన విషయమని చెప్పారు. ఐదేళ్ల నుంచి ఎటూ తేలని వివాదాల విషయంలో పరస్పర చర్చల ద్వారా సత్వర పరిష్కారం కోసం ప్రయత్నించటం అభినందించాల్సిన అంశమన్నారు. కేంద్రం జోక్యం అవసరం లేకుండా పరిష్కారం చేసుకోగలిగితే ఇంకా మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్, జగన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని ఆయన ఆకాంక్షించారు. గత ఐదేళ్లలో ఇదే ఆకాంక్షించానని, కారణం ఎదైనా అది కార్యరూపం దాల్చలేదన్నారు. పరిపాలనా సౌలభ్యం, సత్వర అభివృద్ధి కోసం రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.













