సామాన్య భక్తులకు టీటీడీ పెద్ద పీట
సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో 10 వేల మంది సామాన్య భక్తులు అదనంగా స్వామివారిని దర్శించుకునే అవకాశముంది. టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దుచేసిన టీటీడీ వారంతపు బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మినహాయింపునిచ్చింది. టీటీడీ తాజా నిర్ణయంతో రోజుకు అదనంగా 10 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం లభించనుంది.













