విమాన ప్రయాణికులకు శుభవార్త
విమానాల్లో వైఫై సేవలు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే తెలిపారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే, త్వరలో ప్రయాణికులు విమానాల్లో అంతర్జాలాన్ని ఉపయోగించుకోవచ్చని, ఫోన్లు కూడా చేసుకోవచ్చని వివరించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా వైమానిక సంస్థలు అంతర్జాల సేవలు కల్పిస్తున్నాయి. అయితే భారత గగనతలంలోకి అడుగుపెట్టిన వెంటనే వాటిని నిలిపేయాల్సి వస్తోంది. భద్రతా పరమైన కారణాల వల్ల ఎప్పటినుంచో కేంద్రం ఈ సేవలను వెనక్కునెడుతూ వచ్చింది. తాజాగా దీనిపై కార్యదర్శుల కమిటీ(సీవోఎస్)కి టెలికాం విభాగం ప్రతిపాదన పంపిందని చౌబే వివరించారు. త్వరలో దీనిపై సీవోఎస్ చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. విమానాల్లో వైఫై సేవలు ప్రవేశపెట్టాలంటే, భారత టెలిగ్రాఫ్ చట్టం, భారతీయ టెలిగ్రాఫ్ నిబంధనలను సవరించాల్సి వుంటుంది.













