విలీనం టైమ్..?
కాంగ్రెస్‌లో విలీనం దిశగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అడుగులేస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ..ఆమె పాదయాత్ర చేపట్టారు. అయితే పాదయాత్రతో అనుకున్నంత మైలేజ్ రాలేదు.పోగా.. జైలు కెళ్లాల్సి వచ్చింది. దీనికి తోడు పోలీసుల నిర్భంధాలు కామనయ్యాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని నడపడం కష్టసాధ్యంగా మారింది. ఈపరిస్థితుల్లో కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు.. ఆమెను ఆలోచనలో పడేసింది.. తమ కుటుంబానికి చిరపరిచితమైన డికె శివకుమార్..డిప్యూటీ సీఎంగా మారడంతో.. ఆమె కాంగ్రెస్‌లో విలీనం దిశగా అడుగులేస్తున్నారు.
ఇప్పటికే పలుదపాలుగా ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయిన షర్మిల.. తెలంగాణలోనే కీలక భూమిక పోషించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలో అగ్రనేతలు.. ఆమె రాకను స్వాగతిస్తూనే, ఏపీలో రాజకీయాలు చేయాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్‌కు సైతం తెలిపినట్లు సమాచారం. వైఎస్ కుటుంబానికి చెందిన షర్మిల.. తెలంగాణ కాంగ్రెస్ తరపున పనిచేస్తే, బీఆర్ఎస్కు మరో అస్త్రమిచ్చినట్లు అవుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అయితే షర్మిల మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ తరపునే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసి వచ్చిన షర్మిల.. కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. అంతేకాదు సోనియా, రాహుల్ గాంధీలతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపామన్నారు. మరి షర్మిల ఏమో.. తెలంగాణ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.హైకమాండ్ మాత్రం ఏపీలో పనిచేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంచి అవకాశాలు లభిస్తాయని షర్మిల యోచిస్తున్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అందుకే షర్మిల కాంగ్రెస్ దిశగా అడుగులేస్తున్నారు. కాంగ్రెస్‌లో అయితే వైఎస్ ఆత్మీయులు చాలా మంది ఉన్నారు. అవసరమైన సందర్భాల్లో రికమండ్ చేయడానికి వీలవుతుంది. మరోవైపు.. షర్మిల రాకను.. ఇరురాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నారు. ఆమె రాక..కాంగ్రెస్‌కు బలం చేకూరుస్తుందని చెబుతున్నారు.. రాజశేఖర రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దసంఖ్యలో అభిమానులున్నారు. దీంతో రాజశేఖరరెడ్డి బిడ్డగా ఆమెకు ఆదరణ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది.అవసరానికి తగినట్లుగా ఆమె సేవలను వాడుకోవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది.













