యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. ప్రతీకారం తీర్చుకున్న సోదరుడు!
న్యాయం కోసం నెలల తరబడి ఎదురుచూసి విసిగిపోయిన ఒక కుటుంబం తీసుకున్న ఓ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గతంలో నాలుగు నెలల గర్భిణి అయిన ప్రముఖ యూట్యూబర్, ‘వైషు అమ్మ’ చానెల్ నిర్వాహకురాలు వైష్ణవిని, ఆమె భర్త హరిబాబు దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే హరిబాబు నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. తానే హరిబాబును హత్య చేసినట్లు వైష్ణవి సోదరుడు ప్రకటించారు. నిజామాబాద్‌లో ఈ ఘటన కలకలం రేపింది.
గత మార్చి 17న కొరుట్ల మండలానికి చెందిన వైష్ణవిని ఆమె భర్త హరిబాబు గొంతు నులిమి విచక్షణా రహితంగా హత్య చేశాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం కలిగించింది. వైష్ణవి తండ్రి ఫిర్యాదు మేరకు కొరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి హరిబాబుతో పాటు అతని తల్లి లక్ష్మి, తోబుట్టువులు ఆనంద్, అశోక్‌లపై వరకట్న వేధింపుల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో జైలుపాలైన హరిబాబు కేవలం రెండు నెలల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చి తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం నిజామాబాద్‌లోని శివాజీనగర్ ప్రాంతంలో ఒక పానీపూరి స్టాల్ వద్ద నీళ్లు తాగుతున్న హరిబాబును కొందరు దుండగులు టార్గెట్ చేశారు. కారులో వేగంగా వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా వాహనం దిగి హరిబాబుపై దాడికి దిగారు. కత్తితో అతని మెడపై, తలపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచారు. రక్తపు మడుగులో కుప్పకూలిన హరిబాబును స్థానికులు, పోలీసులు వెంటనే నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
ఈ హత్య జరిగిన కొద్దిసేపటికే మృతురాలు వైష్ణవి సోదరుడు సంతోష్ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. తన చెల్లి మృతికి నెలలు గడుస్తున్నా సరైన న్యాయం జరగలేదని, అందుకే తానే ఈ హత్యకు పాల్పడ్డానని ఆ వీడియోలో సంతోష్ బహిరంగంగా అంగీకరించాడు. నిజామాబాద్‌కు మరో పని మీద వచ్చి తన వాహనంలో ఆయుధాలు ఉంచుకున్నానని, హరిబాబును చూడగానే కుటుంబంలో ఇలాంటి విషాదం మరెవరికీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు చెప్పాడు. తాను పోలీసులకు లొంగిపోతున్నానని చెబుతూ, తన భార్యాపిల్లలను, కుటుంబాన్ని ప్రజలు ఆదుకోవాలని ఆ వీడియోలో అభ్యర్థించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్స్ సాయంతో సీసీటీవీ పుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యుల ప్రమేయంపై పోలీసులు తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, సంతోష్ చేసిన ప్రకటనతో దర్యాప్తు వేగం పుంజుకుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకం సన్నగిల్లి, బాధితులే నేరుగా రివెంజ్ కు పాల్పడడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవస్థల వైఫల్యమే ఇలాంటి దారుణాలకు ఆస్కారం ఇస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








