రాష్ట్రంలో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు : కేటీఆర్
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామానావు వెల్లడించారు. అందరికీ విమాన యోగం కల్పించాలన్న సంకల్పంతో పాత విమానాశ్రయాల పునరుద్ధరణతో పాటు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానించేందుకు హెలిపోర్టస్ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. భదాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అడక్కల్ మండలం గుదిబండ వద్ద కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో పాటు వరంగల్ సమీపంలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, ఆదిలాబాద్ వద్ద ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
వింగ్స్ ఇండియా ప్రదర్శన, సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సెల్టెంట్‌గా నియమించాం. వరంగల్ విమానాశ్రయం త్వరితగతిన కార్యరూపంలోకి వచ్చేందుకు అన్ని శాఖలతో కలిపి పని చేస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ప్రాంతీయ విమానయాన రంగానికి ఊతమిస్తుంది. అలాగే మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్‌కు తోడ్పాటు లభిస్తుంది. ఉడాన్ పథకంలో భాగంగా వరంగల్ విమానాశ్రయాన్ని జత చేయాలని కేంద్రాన్ని కోరాం అని వివరించారు. కాగా, భారత్‌లో తొలి అటానసమ్ బగ్గీని ఆవిష్కరించిన అనంతరం అందులో కేటీఆర్ ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే ఈ వాహనం నడుస్తుంది.













