మహిళల దశాబ్దాల కల సాకారం.. రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి బండి కీలక వ్యాఖ్యలు!
Bandi Sanjay: మహిళా సాధికారతపై చిత్తశుద్ధి ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కల ఈ బిల్లుతో సాకారం కాబోతోందని ఆయన తెలిపారు.
మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా:
‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లు ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒక చారిత్రక ఘట్టమని బండి సంజయ్ అభివర్ణించారు. ఈ బిల్లు మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరుగుతుందని, దీనివల్ల తెలంగాణ అసెంబ్లీలో సుమారు 60 మంది మహిళలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందని ఆయన వెల్లడించారు.
విపక్షాలకు హెచ్చరిక:
మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలకు రాబోయే రోజుల్లో మహిళలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ధృవీకరించారు.
2029 ఎన్నికల లక్ష్యంగా:
2029 లోక్సభ ఎన్నికల నాటికే ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ ప్రయోజనాల కంటే దేశాభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు.







