ఇక షర్మిలకు సలహాలిచ్చేదెవరు..!?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ధీమాగా చెప్తోంది వై.ఎస్. తనయ షర్మిల. అందుకు తగ్గట్లు పార్టీ ఏర్పాట్లలో షర్మిల బిజీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా ఆత్మీయ సమావేశాలు పూర్తి చేసుకున్న షర్మిల నిరుద్యోగుల కోసం దీక్ష చేసి హైప్ క్రియేట్ చేసుకున్నారు. దీక్షకు మంచి రెస్పాన్స్ వచ్చిందని షర్మిలతో పాటు ఆమె అభిమానులు, అనుచరులు సంతోషంగా ఉన్నారు. ఇదే ఉత్సాహన్ని మున్ముందు కూడా కంటిన్యూ చేయాలని షర్మిల భావిస్తోంది. వచ్చే నెలలో పార్టీని అధికారికంగా అనౌన్స్ చేసి ఆ తర్వాత తెలంగాణలో దూసుకెళ్లాలని షర్మిల ప్లాన్ వేశారు.
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయినా వాక్యూమ్ ఉందని భావిస్తున్న షర్మిల.. తన పార్టీ సక్సెస్ అయ్యేందుకు కచ్చితంగా స్కోప్ ఉందని నమ్ముతున్నారు. అధికారంలోకి రావడమే టార్గెట్ గా ఆమె అడుగులు వేస్తున్నారు. ఒకవేళ అధికారంలోకి రాకపోయినా.. కనీసం కింగ్ మేకర్ పాత్ర పోషించడమైతే ఖాయమని షర్మిల, ఆమె అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు. ఇందుకోసం పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ ప్రకటిస్తామని చెప్పగానే కాంగ్రెస్, బీజేపీ ల నుంచి పెద్ద ఎత్తున నేతలు వస్తారని షర్మిల ఆశించారు. కానీ అది జరగలేదు. ఆ పార్టీలకు చెందిన పెద్ద నేతలెవరూ షర్మిల వైపు చూడలేదు. ఇది కాస్త నిరుత్సాహానికి గురి చేస్తోంది. అందుకే నేతలను కాకుండా స్ట్రాటజిస్టులను నమ్ముకోవాలని షర్మిల డిసైడయ్యారు. ప్రశాంత్ కిశోర్ ను సలహాదారుగా నియమించుకోవడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని షర్మిల భావించారు.
ప్రశాంత్ కిశోర్ పట్టిందల్లా బంగారమే. ఆయన ఏ పార్టీకి సేవలందిస్తారో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చారు. వీరిద్దరూ ప్రశాంత్ కిశోర్ సేవలను ఉపయోగించుకున్నారు. అంతకు ముందు 2019లో జగన్ కూడా ప్రశాంత్ కిశోర్ సలహాలతోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తాను కూడా ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకుని తెలంగాణలో అధికారంలోకి రావాలని షర్మిల భావించారు. అయితే ప్రశాంత్ కిశోర్ తాజా ప్రకటన షర్మిలకు మింగుడు పడట్లేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ పార్టీకీ సేవలందించాలనుకోవట్లేదని స్పష్టం చేశారు. ఇంకేదో చేయాలని ఉందని తన మనసులో మాట చెప్పారు. అయితే స్ట్రాటజీ బాధ్యతలను తమ టీమ్ చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రశాంత్ కిశోర్ తో కలిసి పనిచేయాలనుకున్న షర్మిలకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మరి ఇప్పుడు షర్మిల ఏం చేస్తారు.. ప్రశాంత్ కిశోర్ కాకపోయినా ఆయన టీమ్ ద్వారా సలహాలు పొందుతారా.. లేకుంటే ఇంకేదైనా మార్గాన్ని అన్వేషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రశాంత్ కిశోర్ పైనే ఆశలు పెట్టుకున్న షర్మిలకు అడియాశే ఎదురైంది.