తెలంగాణలో ‘వ్యాక్సినేషన్’ పునరుద్ధరణ ఎప్పుడో?

తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అటకెక్కింది. దాదాపు వారం రోజులుగా తెలంగాణలో వ్యాక్సినేషన్ అన్న పదమే వినిపించడం లేదు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఆగిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. దాదాపు 3 లక్షల మందికి ఈ నెల చివరి నాటికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. అయినా వ్యాక్సినేషన్ ప్రారంభంపై ప్రభుత్వం ఎలాంటి విస్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. గతంలో ఒకటి, రెండు రోజులు నిలిపేసిన సందర్భాలున్నాయి. అయితే తొందర్లోనే తిరిగి ప్రక్రియ ప్రారంభమైంది. ఇలా ఏకంగా వారం రోజులుగా నిలిచిపోవడం ఇదే ప్రథమం. దాదాపుగా ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఆగిపోయింది.
తెలంగాణలో ఇప్పటి వరకు 55 లక్షల 24 వేల 649 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 44 లక్షల 54 వేల 87 మంది. రెండో డోస్ పూర్తైన వారి సంఖ్య 10 లక్షల 71 వేల 560 మంది. ఇందులో అత్యధికంగా కోవిషీల్డ్ తీసుకున్న వారే. అయితే గణాకాంల్లో వచ్చిన గందరగోళం వల్లే వ్యాక్సినేషన్ నిలిచిపోయిందన్న వాదన ఒకటి నడుస్తోంది. తెలంగాణకు కేంద్రం 61.41 లక్షల డోసులు ఇచ్చామని పేర్కొనగా, రాష్ట్రం లెక్కల ప్రకారం 56 లక్షల 25 వేల 920 డోసులు వచ్చాయని పేర్కొంటున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 43,76,229 మంది తొలి డోసు తీసుకోగా, 11,37,032 మంది రెండో డోసు తీసుకున్నవారున్నారు.
ఇక… వ్యాక్సినేషన్ కోసం ఏపీ ప్రభుత్వం లాగే తెలంగాణ ప్రభుత్వం కూడా గ్లోబల్ టెండర్లను పిలిచింది. వ్యాక్సినేషన్‌ను తాత్కాలికంగా నిలిపేసిన తర్వాత దాని గురించి ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదు. ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభిస్తామన్న విషయాన్ని కూడా చెప్పడం లేదు. మొదటి డోస్ వేసుకొని, గడువు ముగిసి, రెండో డోస్‌కు దగ్గరగా ఉన్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే గ్లోబల్ టెండర్ల ప్రక్రియ తర్వాతే వ్యాక్సినేషన్ రాష్ట్రంలో తిరిగి ప్రారంభమవుతుందని మరికొందరు అంటున్నారు. గ్లోబల్ టెండర్లు సజావుగా జరిగి, పూర్తైనా వ్యాక్సినేషన్ కావాలంటే మూడు నెలల సమయం కచ్చితంగా పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వ్యాక్సిన్ల విషయం తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ‘ఇండెంట్’ పంపలేదని తెలుస్తో్ంది. అలాగే రాష్ట్రంలో కేసులు తగ్గుతున్నాయని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్న నేపథ్యంలోనూ రాష్ట్రానికి వ్యాక్సిన్ల డోసులు రావడం లేదని కొందరు పేర్కొంటున్నారు. అందుకే తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.