కెసిఆర్ కంచుకోటపై రాములమ్మ కన్ను..

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కి రాజీనామా చేసిన సినీనటి విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు ఎన్నికల ప్రచార ప్లానింగ్ కమిటీ కోఆర్డినేటర్ గా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలను అప్పగించింది. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని విజయశాంతి భావిస్తున్నారట. అది కూడా ఏ మామూలు సీటో కాదు మెదక్.. కెసిఆర్ కంచుకోట.. అక్కడ నుంచి బరిలోకి దిగడానికి విజయశాంతి ఆలోచిస్తుంది. 1997లో బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విజయశాంతి ఆ తర్వాత 2005లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనే కోరికతో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. కెసిఆర్ కోరిక మేరకు కలిసి పోరాడాలి అనే ఉద్దేశంతో తల్లి తెలంగాణను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. 2009లో మెదక్ లోక్ సభ స్థానం నుంచి టిఆర్ఎస్ తరఫున విజయశాంతి ఎన్నికయ్యారు. పార్టీ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే కారణం తో 2013లో విజయశాంతి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 ఎన్నికల్లో అదే మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండి 2020లో బీజేపీ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మెదక్ నుంచి పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి ఈసారి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఈ టికెట్ విజయశాంతికి ఎంతవరకు ఇస్తుందో చూడాలి.