అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ మొదటి స్థానం : వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 రోజులుగా రాష్ట్రం బంద్. కనీ వినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం. కారు చీకట్లో చిరు దీపంలా ఐదారు రోజులుగా జన జీవనం పుంజుకుంటోంది. ఒక్కో రంగం మళ్లీ జీవం పోసుకుంటోంది. నిర్మాణ రంగం ప్రారంభమైంది. ఐటీ రంగం ఆరంభమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాలూ తెరుచుకుంటున్నాయి. గ్రామాలు, మండల కేంద్రాలు, మునిసిపాలిటీల్లో సాధారణ పరిస్థితి నెలకొంటోంది. ఆర్థికంగానూ రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటోంది. కేవలం నాలుగు రోజుల్లోనే మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు, మోటారు వాహన పన్నుల ద్వారా దాదాపు రూ.600 కోట్ల వరకూఐ ఆదాయం సమాకూరింది.
గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు హైదరాబాద్‌లోనూ వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో జీఎస్టీ రూపంలోనూ ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, రాబోయే కొద్ది రోజుల్లోనే ఆర్థిక పరిస్థితి పట్టాలపైకి ఎక్కుతుందని భావిస్తోంది. కరోనాను కట్టడి చేయడంలోనే కాదు, లాక్డౌన్ అనంతర మార్కెట్లోనూ ముందు వరుసలో ఉండాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. పెద్ద ఎత్తున నిధులను వ్యవస్థలోకి డంప్ చేసి, ప్రైవేటు కార్యక్రమాలను వివిస్తృతం చేయాలని భావిస్తోంది. త్వరలో మరిన్ని భారీ నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే నిర్మాణ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు, తయారీ అతిథ్య పర్యాటక రంగాలపై దృష్టి సారించనుంది. లాక్డౌన్ సమయంలోనూ వర్క్ ఫ్రం హోం పేరిట కొన్ని ఐటీ, అనుబంధ కంపెనీలు పనిచేశాయి. నేటి నుంచి అవి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. తద్వారా, త్వరలోనే ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిలో పుంజుకునే వీలుందని సర్కారు భావిస్తోంది.
కరోనా వైరస్ కారణంగా ఎదురైన సంక్షోభం నుంచి బయట పడడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. లాక్డౌన్ అనంతర పరిస్థితిని అర్థం చేసుకుని, తిరిగి అభివృద్ధి వైపు పయనించడానికి వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా నిర్మాణ రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భారీగా డబ్బులను పంపింగ్ చేసినట్టు అవుతుందన్నారు. త్వరలోనే మరిన్ని రంగాలు తమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి బయట పడే ప్రయత్నాల్లో తెలంగాణ మిలిగిన అన్ని రాష్ట్రాలకంటే ముందుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.













